చైనా యుద్ధంపై ‘బ్రూక్స్ – భగత్’ నివేదిను వాడుకోలేదు

చైనా యుద్ధంపై ‘బ్రూక్స్ – భగత్’ నివేదిను వాడుకోలేదు

1962 యుద్ధంలో చైనా చేతిలో భారత్ ఘోర ఓటమికి నాటి నెహ్రూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కారణమనే అంశం ‘హెండెర్సన్ బ్రూక్స్ – భగత్’ నివేదికలో ఉందని  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఈవిషయం తెలిసినప్పటికీ ఆ నివేదికను అధికార రహస్యంగానే ఉంచాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రిజిజు చెప్పారు. ముమ్మాటికీ ఈ నిర్ణయం సరైందేనని స్పష్టం చేశారు.

‘హెండెర్సన్ బ్రూక్స్ – భగత్’ నివేదిక దేశ రక్షణతో ముడిపడిన సున్నితమైన అంశమైనందున, దాన్ని తాము రాజకీయ అస్త్రంగా వినియోగించలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రిజిజు ఒక ట్వీట్ చేశారు. 2024 నవంబరు 1న ఎక్స్ వేదికగా తాను చేసిన ఒక ట్వీట్‌ను ఆయన ఇప్పుడు మళ్లీ షేర్ చేశారు.  ఆ రోజున చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ పట్టణం బుమ్లాలో భారత ఆర్మీ జవాన్ల దీపావళి వేడుకల్లో కేంద్ర మంత్రి రిజిజు పాల్గొన్నారు. చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ మౌలిక సదుపాయాలను మోదీ సర్కారు బలోపేతం చేసిన అంశం గురించి అప్పటి ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన ‘’ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చదివే ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. ఆ గ్రంధం 2024 ఏప్రిల్‌లోనే భారత్‌లో విడుదల కావాల్సి ఉండగా, దానికి భారత రక్షణ శాఖ ఆమోదం లభించలేదు. దీంతో ఈ బుక్ను పెంగ్విన్ పబ్లిషర్స్ సంస్థ మన దేశంలో అధికారికంగా పబ్లిష్ చేయలేదని రాహుల్ చెప్పారు.


కాగా, థామస్ బ్రియాన్ హెండెర్సన్ బ్రూక్స్ 1909లో బర్మాలో జన్మించారు. ఈయన 1929 నుంచి 1947 వరకు భారత్‌లోని బ్రిటీష్ ప్రభుత్వ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. దేశానికి బ్రిటీష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం వచ్చాక, 1947 నుంచి 1964 వరకు భారత ఆర్మీలో జనరల్ ఆఫీసర్ హోదాలో సేవలు అందించారు. 
భారత ఆర్మీ బ్రిగేడియర్ పీఎస్ భగత్, థామస్ బ్రియాన్ హెండెర్సన్ బ్రూక్స్‌లతో కూడిన దర్యాప్తు బృందం 1962 భారత్ – చైనా యుద్ధంపై సమీక్షా నివేదికను రూపొందించింది. దీన్నే ‘హెండెర్సన్ బ్రూక్స్ – భగత్’ నివేదిక అంటారు.