దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగుతుందన్న విశ్వాసంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ అనంతరం నిర్వహించిన తొలి సమీక్ష కావడంతో నిర్ణయంపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూశాయి.
గతేడాది పలుమార్లు వడ్డీరేట్లలో కోతలు విధించిన ఆర్‌బీఐ ఈసారి మాత్రం వేచి చూద్దాం అనే ధోరణి అవలంబించిందని చెప్పాలి. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యం సాధించడమే లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లను మార్చాల్సిన అవసరం లేదని భావించినట్లు తెలిపారు.
2025లో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో గణనీయమైన మార్పులు చేసింది. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అనంతరం జూన్‌లో 50 బేసిస్ పాయింట్ల భారీ కోత విధించింది. డిసెంబరులో మరో 25 శాతం తగ్గించడంతో మొత్తం ఏడాదిలో రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది. ఈ తగ్గింపులతో రుణాలు చౌకగా మారి వినియోగం, పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కార్పొరేట్ రంగంలో లాభాలు మెరుగుపడటం, అసంఘటిత రంగంలో స్థిరత్వం పెరగడం, తయారీ రంగానికి ఊతమివ్వనున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.4 శాతం నమోదవుతుందని అంచనా వేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో కూడా వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నారు. తొలి త్రైమాసికంలో 6.9 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ బలంగా ఉండటం ప్రధాన బలం అని తెలిపారు. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 2.1 శాతం ఉండొచ్చని అంచనా. అయితే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతం వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది ఆర్‌బీఐ లక్ష్య పరిధిలోనే ఉందని గవర్నర్ తెలిపారు. భారత్– ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, త్వరలో కుదిరే భారత్– అమెరికా ట్రేడ్ డీల్ దేశ ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూరుస్తాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశముందని తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పాత్ర మరింత విస్తరించనుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. దేశ విదేశీ మారక నిల్వలు కూడా బలంగా ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల్లో దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో రోజువారీ సగటున రూ.75 వేల కోట్ల మేర ద్రవ్య లభ్యత ఉందని తెలిపారు.

More Stories
కలలు కనకపోవడం నేరం .. సాకారంకు కార్యాచరణ అవసరం
అజిత్ దోవల్,మార్కో రూబియో భేటీ జరగనే లేదు
రష్యా చమురు దిగుమతిని భారత్ పూర్తిగా ఆపలేదు