మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసి రూ.12,930 కోట్ల లాభాలు

మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసి రూ.12,930 కోట్ల లాభాలు
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.12,930 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.11,008 కోట్ల లాభాలతో పోల్చితే 17 శాతం వృద్ధిని సాధించింది. 

క్రితం క్యూ3లో ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం నికర ప్రీమియం ఆదాయం 17 శాతం పెరిగి రూ.1.26 లక్షల కోట్లకు చేరింది. 2024ా25 ఇదే క్యూ3లో రూ.1.07 లక్షల కోట్ల ప్రీమియంను నమోదు చేసింది. 2025-26 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఎల్‌ఐసి మొత్తంగా 1,16,63,856 పాలసీలను విక్రయించగా,  ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో 1,17,10,505 పాలసీల అమ్మకాలను నమోదు చేసింది.

ఇదే సమయంలో రూ.3,40,563 కోట్లుగా ఉన్న మొత్తం ప్రీమియం ఆదాయం, 2025 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల్లో 9.02 శాతం పెరిగి రూ.3,71,293 కోట్లుగా చోటు చేసుకుంది. 2025 డిసెంబర్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసి మొత్తం ఆస్తుల నిర్వహణ (ఎయుఎం) 8.01 శాతం పెరిగి రూ.59,16,680 కోట్లకు చేరింది. 2024 ఇదే సమయం నాటికి రూ.54,77,651 కోట్లుగా ఎయుఎం ఉంది. 

జీవిత బీమా మార్కెట్‌లో రెండు డజన్ల పైగా కంపెనీలున్నప్పటికీ బీమా వ్యాపారంలో ఎల్‌ఐసి ఇప్పటికీ 57.07 శాతం వాటాతో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. 2024 డిసెంబర్‌ నాటి 57.42 శాతం వాటాతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. గురువారం బిఎస్‌ఇలో ఎల్‌ఐసి షేర్‌ 0.65 శాతం పెరిగి రూ.840.45 వద్ద ముగిసింది.