భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై వచ్చేవారం సంతకాలు

భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై వచ్చేవారం సంతకాలు

భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై మరో నాలుగైదు రోజుల్లో సంతకాలు జరిగే అవకాశముందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. ఆ ప్రకటన ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్య సహకారానికి స్పష్టమైన దిశా నిర్దేశం కలుగుతుందని తెలిపారు.  సంయుక్త ప్రకటన తర్వాత అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అనుకూలంగా టారిఫ్‌లను తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు పీయూశ్ గోయల్ చెప్పారు.

ప్రస్తుతం భారతీయ వస్తువులపై 25 శాతం పరస్పర సుంకం అమలులో ఉంది. అదనంగా రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా మరో 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నారు. అయితే ఈ సుంకాలను తగ్గించి 18 శాతానికి తీసుకురావాలని అమెరికా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే భారత ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారనుంది.

ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజినీరింగ్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు గణనీయమైన లాభం చేకూరే అవకాశముంది. సంయుక్త ప్రకటన తర్వాత పూర్తి స్థాయి లీగల్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుందని పీయూశ్ గోయల్ స్పష్టం చేశారు. మార్చి మధ్య నాటికి ఆ ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

లీగల్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చిన తర్వాతే భారత్ తన ఎంఎఫ్ఎన్ టారిఫ్‌లు తగ్గించగలదని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వివరించారు. అమెరికా సుంకాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మారుతాయని, భారత్‌లో మాత్రం చట్టపరమైన ప్రక్రియ తర్వాతే అమలులోకి వస్తాయని తెలిపారు.

ఈ ఒప్పందంలో పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి కట్టుబాట్లు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందమేనని పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. అలాగే, కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ కూడా సుంకాలు తగ్గించనున్నట్లు తెలిపారు. ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరపూరకంగా ఉన్నాయని చెప్పారు. ట్రేడ్ డీల్ వల్ల ఇరువైపులా లాభాలే ఉంటాయని అన్నారు.