రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీపై గురువారం రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంటులో అంతర్గత భాగాలుగా లోక్‌సభ, రాజ్యసభ ఉన్నప్పటికీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కొన్ని అంశాలపై మాట్లాడనివ్వక పోవడం దారుణం అని రాజ్యసభ విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశంపై మాట్లాడే అవకాశాన్ని రాహుల్‌కు ఇవ్వకపోవడం సరికాదని పేర్కొంటూ ఈవిధంగా లోక్‌సభను నడపడం సరికాదని ఖర్గే హితవు చెప్పారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ లోక్‌సభ వ్యవహారాల గురించి రాజ్యసభలో ప్రస్తావన తేకూడదని సూచించారు. వెంటనే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరెణ్ రిజిజు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఖర్గే బదులిస్తూ, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వనందు వల్లే గత నాలుగు రోజులుగా లోక్‌సభ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లోక్‌సభను నిర్వీర్యం చేయడం సరికాదని చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడటం మొదలుపెడితే, బీజేపీ ప్రభుత్వానికి దురద పుడుతుందని ఎద్దేవా చేశారు.
ఖర్గే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తిప్పికొట్టారు. లోక్‌సభ వ్యవహారాలను రాజ్యసభలో చర్చించకూడదనే దానిపై గత రాజ్యసభ ఛైర్మన్ స్పష్టమైన రూలింగ్స్ ఇచ్చారని గుర్తుచేశారు. అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నడ్డా తెలిపారు. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నప్పటికీ, లోక్‌సభ సజావుగా సాగే అవకాశాన్నే విపక్షాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కోరగానే, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రకటన విడుదల చేశారని జేపీ నడ్డా చెప్పారు. ఒక అమాయక బాలుడి చేతిలో కాంగ్రెస్ పార్టీని బందీగా చేయొద్దని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఖర్గేకు నడ్డా హితవు చెప్పారు. ఈనేపథ్యంలో మోదీ సర్కారు వైఖరికి నిరసనగా విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.
లోక్‌సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదని రాజ్యసభ వేదికగాఖర్గే చేసిన ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. రాహుల్ గాంధీకి 40నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని లోక్‌సభ స్పీకర్ ఇచ్చారని, కానీ ఆయన సభా నియమాలను ఉల్లంఘించి ఇతర అంశాలను ప్రస్తావించారని రిజిజు విమర్శించారు.

More Stories
లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడియత్నం?
ప్రధాని సీట్ ను చుట్టుముట్టిన వివక్ష మహిళా ఎంపీలు
మణిపుర్ నూతన సీఎంగా యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్