`చికెన్స్ నెక్’ కారిడార్ వెంబడి భూగర్భ రైలు మార్గం

`చికెన్స్ నెక్’ కారిడార్ వెంబడి భూగర్భ రైలు మార్గం

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన `చికెన్స్ నెక్’ విషయంలో బంగ్లాదేశ్ బెదిరింపుల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు సురక్షితమైన మార్గాన్ని అందించేలా భూగర్బ రైలు కారిడార్‌ను కేంద్రం ప్రతిపాదించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు.  దశాబ్దాలుగా మన సరిహద్దుల లోపల, వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తులు చికెన్స్ నెక్ ప్రాంతాన్ని బెదిరింపు వ్యూహంగా ఉపయోగిస్తున్నాయని హిమాంత మండిపడ్డారు.

ప్రతిపాదిత భూగర్భ రైలు మార్గం ఈశాన్య రాష్ట్రాలకు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య సురక్షితమైన, పటిష్టమైన రవాణా మార్గాన్ని సృష్టించి తద్వారా ఒక ప్రధాన వ్యూహాత్మక పురోగతిని సూచిస్తుందని తెలిపారు. కారిడార్‌లో రద్దీని తగ్గించడం, రిడెండెన్సీని మెరుగుపరచడం,  ప్రయాణీకులు, వస్తువులు, రక్షణ లాజిస్టిక్‌ల అంతరాయం లేని కదలికను నిర్ధారించడం అనే భారతీయ రైల్వేల దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భూగర్భ రైలు ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం, సిలిగురి కారిడార్ బహుళ రైల్వే లైన్లు, హైవేలు, చమురు పైపులైన్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి.

ఇది దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించబడే, సున్నితమైన రవాణా మండలాలలో ఒకటిగా నిలిచింది.  ఈ ప్రాంతం ‘వ్యూహాత్మక బలహీనత’ను 1971 యుద్ధం తర్వాతే పరిష్కరించి ఉండాల్సిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు రెండు చికెన్స్ నెక్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. చికెన్స్ నెక్‌కు మొత్తం 40 కిలోమీటర్ల వ్యూహాత్మక కారిడార్ వెంబడి భూగర్భ రైల్వే, మిగతా వాటిని నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు అసోం ముఖ్యమంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘ఈ దీర్ఘకాలిక వ్యూహాత్మక బలహీనతను తగ్గించే దిశగా మేము ఒక భారీ అడుగు వేస్తున్నాం.. వాస్తవానికి, దీనిని చాలా ముందుగానే బహుశా 1971 యుద్ధం తర్వాతే పరిష్కరించి ఉండాల్సింది’ అని పేర్కొన్నారు.  అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ‘చికెన్స్ నెక్ కారిడార్‌ను విస్తరణకు చర్యలు తీసుకుని ఉండాల్సిందని శర్మ అంతకుముందు చెప్పారు.

‘ఆమె ఈశాన్య ప్రాంతానికి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు నేరుగా ప్రాప్యత లభించేలా మ్యాప్‌ను తిరిగి గీసి ఉండాల్సింది. తద్వారా ‘చికెన్స్ నెక్’ కారిడార్‌పై ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పంజాబ్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చి చిట్టగాంగ్ పోర్టును మార్పిడి చేసుకోకుండా ఉండి ఉంటే, ఈశాన్య ప్రాంతం ‘చికెన్స్ నెక్’పై ఆధారపడి ఉండేది కాదని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.

బంగ్లాదేశ్ లోని సిలిగురి కారిడార్ మరోపేరు చికెన్స్ నెక్.  కోడి మెడ ఆకారంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. సిలిగురి నగరం చుట్టూ 20- 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది.  పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, దక్షిణంలో బంగ్లాదేశ్, తూర్పువైపున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.

ఈ ప్రాంతం డార్జిలింగ్, జలపాయ్‌గురి జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక, ప్రతిపాదిన భూగర్బ రైలు మార్గం పశ్చిమ్ బెంగాల్‌లోని టిన్ మైల్ హాత్, రంగపాని రైల్వే స్టేషన్ల మధ్య నిర్మాణం జరగనుందని ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ అధికారులు తెలిపారు. వీటిలో ఒక మార్గం బెంగాల్‌లోని బగ్దోగ్రా వెళ్తుందని, ఇది దేశ వైమానిక రక్షణ యంత్రాంగానికి చాలా కీలకమైందని పేర్కొన్నారు.