పెన్నియార్ నది వివాదాన్ని చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ట్రైబ్యునల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతర్ రాష్ట్రాల మధ్య నదీ వివాదాన్ని పరిష్కరించేందుకు నెలలోగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు దాఖలు చేసిన ఫిర్యాదును కేంద్రం రాజ్యాంగ ట్రైబ్యునల్ ఎదుట ఉంచవచ్చని ధర్మాసనం ఆదేశించింది.
పెన్నియార్ నదీ ప్రవాహ దిశను మార్చే విధంగా కర్ణాటక ప్రభుత్వం డ్యామ్‌లను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రజలకు నష్టం కలిగేలా పెన్నియార్ నది నీటిని వినియోగించే హక్కు కర్ణాటక ప్రభుత్వానికి లేదని పిటిషన్లో పేర్కొంది. అంతర్రాష్ట్రాల నదీ ప్రవాహ జలాలు జాతీయ ఆస్తి అని, కేవలం ఒక్క రాష్ట్రానికే యాజమాన్య హక్కులు చెందవని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.
నదీ జలాలపై 1982 ఒప్పందం ”చెల్లుబాటు అయ్యేది మరియు కట్టుబడి” ఉండాలని పేర్కొంది. నదిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నీటిని అందించే వాగులు, ఉపనదులు మరియు ఇతర ప్రవాహాలు కూడా ఉన్నాయని తమిళనాడు పేర్కొంది. అలాగే తమిళనాడు, కర్ణాటకల్లో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న ప్రధాన మార్కండేయనది .. ఒప్పందం పరిధికి వెలుపల ఉందని వాదించలేమని, నదీ ప్రవాహాన్ని అడ్డుకునే ఏ నిర్మాణమైనా 1982 నదీజలాల ఒప్పందం ద్వారా నిర్వహించబడుతుంది మరియు నియంత్రించబడుతుంది అని తమిళనాడు వాదించింది.

More Stories
జనగణనలో కుల నమోదుపై సుప్రీంలో పిల్ కొట్టివేత
జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు
ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి!