దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి

దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి
దివ్యాంగులకు  సర్టిఫికేట్ లు ఇవ్వడంలో సులభతర విధానం అవలంభించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కోరారు. దివ్యాంగులకు వైకల్యం ధృవీకరణ పత్రం తీసుకోవడం లో ఇబ్బందులు ఉన్నాయని బిజెపి జనతా వారధికి లెక్కకు మించి ఫిర్యాదులు రావడంతో ఈ విషయమై దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు. పుట్టిన ప్రతి పౌరుడికీ గౌరవంగా జీవించే హక్కు ఉన్నట్లే, దివ్యాంగులకు కూడా అదే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
 
కానీ నేడు ఆ హక్కును పొందాలంటే దివ్యాంగుడు తన దివ్యాంగత్వాన్ని కాదు, తన సహనాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాధవ్ వాపోయారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం మంచిది కాదని పేర్కొంటూ దివ్యాంగులకు మరింత నాణ్యమైన సేవలకోసం ఆలోచన చేయాలని ఆయన సూచించారు.  
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో వున్న దివ్యంగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని, వారి ఆవేదన మా మనసులను కలచివేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యంగుల సర్టిఫికేట్ కోసం వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని చెబుతూ సర్టిఫికెట్ ఎప్పుడూ వస్తుందో తెలియక, ఎందుకు తిరస్కారంకు గురవుతుందో అర్ధంకాక వారి మధన పడుతున్నట్లు చెప్పారు. 
ప్రభుత్వం జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ ద్వారానే పెన్షన్, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, పథకాలు లభిస్తున్నప్పటికీ, ఆ సర్టిఫికెట్ కోసం ఒక దివ్యాంగుడు గ్రామ సచివాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా మెడికల్ బోర్డు అంటూ కనీసం 6 నుంచి 9 మంది అధికారుల చుట్టూ నెలలుపాటు తిరగాల్సి వస్తుందని ఆయన  విచారం వ్యక్తం చేశారు.  సాంకేతికత ఉన్నది పనిని సులభం చేయడానికి అయినప్పటికీ ఆ సాంకేతిక పరీక్షకు చేరటానికి దివ్యాంగునికి ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయని అధికారులు ఎందుకు గమనించరు? అని మాధవ్ విస్మయం వ్యక్తం చేశారు. 
స్లాట్ కోసం నెలల నిరీక్షణ, సంవత్సరాల ఎదురు చూపులు, రవాణా లేమి, సహాయకుల అవసరం, ఒకే పనికి పలుమార్లు తిరగడం , ఇవన్నీ దివ్యాంగుడికే కాదు, అతని కుటుంబానికీ సహితం మానసిక, ఆర్థిక భారంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  దివ్యాంగుడిగా పుట్టడం ఎవరి తప్పు కాదని చెబుతూ దివ్యాంగుడిగా గుర్తింపు పొందడానికి ఇన్ని తలుపులు తట్టాల్సి రావడం మన  వైఫల్యమే అని స్పష్టం చేశారు. అందుకే దివ్యంగులకోసం ఒకే కౌంటర్, ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష విధానం అవలంభించాలని మాధవ్ డిమాండ్ చేశారు.  
మండల స్థాయిలో మెడికల్ బోర్డు శిబిరాలు నిర్వహించాలని, తీవ్రమైన దివ్యాంగులకు ఇంటివద్దనే పరిశీలించే సదుపాయం కల్పించాలని,  యుడిఐడి, సదరెం, పెన్షన్ అన్నీ ఒకే ప్రక్రియ గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులకు కరుణ కాదు, దయ కాదు వారికి కావాల్సింది హక్కు, గౌరవం, సులభమైన వ్యవస్థ అని మాధవ్ తేల్చి చెప్పారు.

దివ్యాంగుడి కన్నీరు ఫైళ్లలో మునిగిపోకూడదని, అది మన పాలనను కదిలించాలని బిజెపి కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టం, 2016 ద్వారా దివ్యాంగుల హక్కులు, వివక్ష నిషేధం, కనీసం 40% దివ్యాంగత్వం వంటి మూల ప్రమాణాలు నిర్దేశించి, ఏ రకం వైకల్యానికి ఎలా శాతం లెక్కించాలి అనే మార్గదర్శకాలు రూపొందించినట్లు ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. 

అలాగే దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుగా యుడిఐడి విధానం రూపొందించిందని పేర్కొంటూ ఇది సులభతరంగా అమలు చేసి దివ్యాంగుని తలుపుతట్టి సేవలందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ లో జవాబుదారీతనంతో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు సర్టిఫికేట్ లు ఇచ్చే సులభతర ప్రక్రియతో ముందుకు వెళ్ళాలని మాధవ్ కోరారు.