సిట్ సిఫార్సుపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ

సిట్ సిఫార్సుపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్పై బదిలీ వేటు పడింది. నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జీఏడీలో రిపోర్టు చేయాలని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. 

1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సింఘాల్‌ గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్‌ 4 వరకు టీటీడీ ఈవోగా పని చేశారు. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనకు టీటీడీ ఈవోగా 2వ సారి అవకాశం లభించింది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన టీటీడీ ఈవోగా 2వ సారి బాధ్యతలు చేపట్టారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారమై అప్పటి, ఇప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఏ అండ్‌ సీఓ) బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల సిట్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సిట్‌ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. అందులోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పని చేశారని పేర్కొంది. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని తెలిపింది.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019 ముందున్న కఠిన నిబంధనల్ని వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని సడలించారు. 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. టర్నోవర్‌ మొత్తాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు. ఈ సడలింపుల వల్లే 2019-2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది.