నిజామాబాద్‌లో జనవరి 23వ తేదీన గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(25) పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఎస్సై కావాలని కలలు కన్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని మెస్రా మండల కేంద్రం. పేద దంపతులైన సాయిలు-చంద్రకళల ఒక్కగానొక్క కుమార్తె. డిగ్రీ చదువు పూర్తికాగానే 2024లో తొలి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ కొలువు సాధించారు. ఆమె తమ్ముడు శ్రావణ్ డిగ్రీ పూర్తవగా, ఎస్సై ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు.
సంతలో మసాలాలను అమ్ముతూ తనను ఉన్నత చదువులు చదివించిన కన్నవాళ్ల కలలను నెరవేర్చేందుకు సౌమ్య క్రమశిక్షణతో ఎంతగానో శ్రమించారు. ఆమె కూడా ఎస్సై కొలువే లక్ష్యంగా సాధనను కొనసాగించారు. తొలిమెట్టుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టును సాధించి నిజామాబాద్‌లో ఏడాది క్రితం విధులు చేపట్టారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జనవరి 23వ తేదీన ఎక్సైజ్ సీఐ స్వప్న బృందంతో పాటే కానిస్టేబుల్ సౌమ్య తనిఖీలకు వెళ్లారు.
నిజామాబాద్ శివారు మాధవనగర్ వద్ద సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కారును ఆపినట్టే ఆపిన గంజాయి ముఠా సౌమ్యను తొక్కించుకుని ముందుకువెళ్లింది. అదుపుతప్పిన వెహికల్‌ను చుట్టుముట్టిన అధికారులు మైనర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను నిజామాబాద్‌లోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్చించగా వైద్యులు ఆపరేషన్ చేసి దెబ్బతిన్న మూత్రపిండాన్ని తొలగించారు.
రెండ్రోజుల తర్వాత ఆమెను ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(25) కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ కొలువు ఇవ్వనున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.

More Stories
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా బిజెపి నామినేషన్లు!
కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్