గుంటూరులో ఉద్రిక్తత మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌

గుంటూరులో ఉద్రిక్తత మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. చంద్రబాబు నాయుడిని అసభ్యంగా దూషించారని పేర్కొంటూ వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సిద్ధార్ధ నగర్‌లోని అంబటి ఇంటిపై దాడికి దిగారు. అంబటిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ చేస్తూ ఇంటిలోకి ప్రవేశించిన కొందరు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 

పెద్ద సంఖ్యలో పోలీసులు అంబటి ఇంటి వద్దకు చేరుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు భారీ భద్రత మధ్య అంబటిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలోనే కొందరు అంబటి కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 

ఈ పరిణామాలు జరుగుతుండగానే అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 60 మంది పోలీసులు తమను నిర్బంధించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘దుర్మార్గాలను ప్రశ్నిస్తే చంపేస్తారా..’అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు చోటుచేసుకున్న పరిణామాలతో గుంటూరు నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి, పలు చోట్ల టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పర నిరసనలకు దిగాయి. తిరుమల లడ్డూ వివాదంలో వైసిపికి వ్యతిరేకంగా గోరంట్ల గ్రామం వద్ద టిడిపి వారు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని తొలగించాలని లేదా తామే తొలగిస్తామని అంబటి ప్రకటించారు.

తిరుమల లడ్డూ అంశంపై టిడిపి వారు అభాసుపాలయ్యారని, పాపప్రక్షాళన జరగాలని చెబుతూ గోరంట్ల వెంకటేశ్వర ఆలయంలో పూజ చేసి వస్తుండగా, టిడిపి కార్యకర్తలు ఆయనను అడ్డుకుని దాడికి ప్రయత్నించారు.  దీంతో, అంబటి తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడిన మాటలు కొన్ని టివి ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొంటూ టిడిపి శ్రేణులు గుంటూరు సిద్ధార్ధ నగర్‌లోని అంబటి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

తొలుత కొంతమంది టిటిడి కార్యకర్తలు దాడికి ప్రయత్నించగా, వైసిపి వారు ప్రతిఘటించారు. తర్వాత టిడిపి శ్రేణులు వందలాదిగా మూకుమ్మడిగా తరలిరావడంతో అంబటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు టిడిపి కార్యకర్తలు ఆయన ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లు విసిరారు.  ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో అంబటి ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాడ్లతో విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. ఇంట్లోని కారును, పూల కుండీలను, సిసి కెమెరాలను, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.

కోడిగుడ్లు విసిరారు. రాళ్లు రువ్వారు. కర్రలతో కార్లను పగులగొట్టారు. కార్యాలయంలో ఉన్న అంబటిపై దాడికి విఫలయత్నం చేశారు.  కొంతమంది ఆయనపై నేరుగా దాడికి వెళ్లారు. కొందరి వైసిపి నాయకుల కార్లనూ ధ్వంసం చేశారు. ప్రతిసారీ నోరు పారేసుకోవడం అంబటికి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు టిడిపి కార్పొరేటర్లు, నగర నాయకులు అంబటి ఇంటి వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. 

విధ్వంసం జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారు. అంబటికి మద్దతుగా వచ్చిన వైసిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపేశారు. అంబటితోపాటు వైసిపి అధినేత జగన్‌ను కూడా టిడిపి నాయకులు దూషించినా వారించలేదు. దాదాపు ఐదు గంటల పాటు టిడిపి శ్రేణుల విధ్వంస కాండ కొనసాగింది. 

అంబటిపై టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, మరికొందరు నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా సూమోటోగా కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాత్రి 10.30 గంటలకు ఆయనను అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  ఆ తర్వాత కూడా టిడిపి శ్రేణులు ఆందోళన కొనసాగింది. ఆయన ఇంటికి కొందరు టిడిపి కార్యకర్తలు నిప్పు అంటించారు. దీంతో, ఇంట్లోని ఫర్నీచర్‌, కిటికీ దగ్ధమయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకొని మంటలను ఆర్పివేశారు.