11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 14వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే బీఏసీ సమావేశాల్లో పనిదినాలను శాసనసభ, మండలి ఖరారు చేయనుంది.

ఇదిలావుంటే 2026-27కు రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించింది.  దీంతోపాటు 2025-26 అంచనాల సవరణ ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని, అదే సమయంలో ఏ ప్రభుత్వ హెడ్‌ కింద ఎంతమొత్తం ఆదా అయ్యిందో ముందే గుర్తించాలని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా వివిధ ఖాతాల కింద ఎంత ఖర్చు చేశారు? మిగిలిన మూడు నెలల్లో ఎంత ఖర్చుచేసే అవకాశముందో స్పష్టమైన అంచనాలతో సవరణలు ప్రతిపాదించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. ఇళ్ల నిర్మాణం, రహదారులు, ఇతర రవాణా సౌకర్యాల అభివృద్ధి, రక్షిత నీటికల్పన, విద్య, వైద్యం తదితర అంశాల్లో ప్రమాణాల మెరుగుదల, పారిశ్రామికీకరణ విస్తృతిని దృష్టిలో ఉంచుకొని మూలధన బడ్జెట్‌ ప్రణాళిక రూపొందించాలి. 
 
అలాగే పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అమలయ్యే పథకాలు, నాబార్డ్, హడ్కో సాయంతో చేపడుతున్న పనుల గురించి వివరంగా సమర్పించాలి.