ఈ మేరకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వేదిక మార్పుపై బీసీబీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఐసీసీ, భారత్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు భద్రతాపరమైన అంశాలను స్వయంగా సమీక్షించింది. ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేనప్పుడు టోర్నీలో వేదికలు మారుస్తే భవిష్యత్లో ఇతర జట్ల నుంచి తరచూ ఇలాంటి ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయని ఐసీసీ పేర్కొంది.
“ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ వేదికలను వేరే చోటుకి మార్చడం వల్ల ఐసీసీ పవిత్రతకు భంగం కలుగుతుందని, ప్రపంచ పాలక సంస్థ తటస్థతను దెబ్బతీస్తుందని బోర్డు గుర్తించింది” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ వ్యవహారంపై బీసీబీ అధికారులతో ఇప్పటికే పలుమార్లు జరిపిన చర్చల్లో టోర్నమెంట్ భద్రతా ఏర్పాట్లపై ఐసీసీ వివరణాత్మక సమాచారాన్ని అందించినట్లు తెలిసింది.
మరోవైపు ఐసీసీ బంగ్లాకు ఈ విషయమై ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. అయితే, మరో 24 గంటలు అదనపు సమయం ఇచ్చింది. బంగ్లా ప్రతిపాదనపై ఐసీసీ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించిన తర్వాత తిరస్కరించింది. బంగ్లాదేశ్ భారత్ లోనే మ్యాచులు ఆడాలా? లేక వేరే చోట నిర్వహించాలా? అనే అంశంపై ఓటింగ్ పెట్టింది.
ఇందులో భారత్ లో బంగ్లా ఆడాల్సిందే అని 14 ఓట్లు, మరో చోట ఆడాలని 2 ఓట్లు వచ్చాయి. అంటే పాకిస్థాన్ తప్ప మరే దేశం కూడా బంగ్లాదేశ్ విజ్ఞప్తికి మద్దతు ఇవ్వలేదు. దీంతో బంగ్లాదేశ్ భారత్ లో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసీసీ తుది హెచ్చరిక జారీ చేసింది. దీనిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా బంగ్లాకు సూచించింది. ఒకవేళ బంగ్లా పాల్గొనకుంటే, ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును ఆడించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది.

More Stories
నకిలీ పిజా హట్ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి
బంగ్లాదేశ్ లో దౌత్య సిబ్బంది కుటుంభం సభ్యుల తరలింపు!
కెనడా, వెనుజులా, గ్రీన్ల్యాండ్లతో సహా ట్రంప్ కొత్త మ్యాప్