బీజాపూర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు మృతి!

బీజాపూర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు మృతి!
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక వ్యూహకర్తగా ఉన్న పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది.
 
మాడ్వి హిడ్మా సహా పలువురు సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో పాపారావు ఒకడిగా కొనసాగుతున్నాడు. పాపారావు కదలికలపై నిఘా సమాచారం అందడంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి.  ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు భీకర పోరు జరిగినట్టు తెలిసింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు.  తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు చేపట్టగా  ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఏకే-47, ఇతర ఆయుధ, వస్తు సామగ్రి లభించింది.
మృతుల్లో ఒకరు డివిజనల్‌ కమిటీ సభ్యుడు, నేషనల్‌ పార్క్‌ ఏరియా దళ కమాండర్‌ దిలీప్‌ బెడ్జా, ఏరియా కమిటీ మెంబర్‌ కోసా మాండవిగా పోలీసులు గుర్తించారు. ఎదురుకాల్పుల ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించి గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. గతేడాది నవంబర్‌లో ఇదే ఇంద్రావతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాపారావు తృటిలో తప్పించుకున్నాడు.
అప్పట్లో అతని భార్య ఊర్మిళ సహా పలువురు నేతలు మృతి చెందారు.  అయితే అప్పట్లో తప్పించుకున్న పాపారావు, ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతిలో హతమవడం గమనార్హంగా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మరోవంక, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో డివిజన్ కమిటీ సభ్యుడితో సహా 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉన్నారు. వీరంతా సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్రసింగ్ నేగీ, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎదుట గురువారం నాడు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.45 కోట్ల మేర రివార్డులు ఉన్నట్లుగా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరికి తక్షణసాయం కింద ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.