శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో పోన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. ఈ సందర్భంగా హరిహరక్షేత్రం శబరిమల ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి తళుక్కున మెరిసిన మకర జ్యోతిని దర్శించుకున్నారు.
జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు.
ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. అది చూసి మనసు నిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు.
తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలిగి, నేరుగా భగవంతుడిని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు.
ఇక రామాయణంలో కూడా శబరిమల ప్రస్తావన ఉండటం గమనార్హం. రాముడు పంబా నదీ తీరంలోని శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు చెబుతారు. సోమవారం వరకు 51 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హైకోర్టు ఆదేశాల మేరకు భక్తుల సంఖ్యపై కఠిన నియంత్రణలు అమలు చేశారు.
దీపారాధనకు ముందు 18వ మేట్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనానికి అనుకూలమైన పండితతావలం, శరంకుట్టి వంటి ప్రాంతాలకు తరలివెళ్లారు. నిలక్కల్, పంబ, ఎరుమేలి వంటి కేంద్రాల్లో రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దీపారాధన అనంతరం మాత్రమే పంబ నుంచి యాత్రికులను కొండ ఎక్కేందుకు అనుమతించారు.

More Stories
వాట్సప్చాట్ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు ఇవ్వలేం
టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్
గల్ఫ్ దేశాల్లో భారతీయులు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నం