బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల రక్తపాతం ఆగడం లేదు. దేశంలో 13వ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందువులే లక్ష్యంగా దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా సునమ్‌గంజ్ జిల్లాలోని భంగాడోహర్ గ్రామంలో జాయ్ మహాపాత్రో అనే హిందూ యువకుడిని అమీరుల్ ఇస్లాం అనే స్థానిక వ్యక్తి అత్యంత కిరాతకంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపిన ఉదంతం కలకలం రేపుతోంది. 
 
కేవలం 20 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘోరం జరగడం ఇది రెండోసారి. మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం డిసెంబర్ నెలలోనే హిందువులపై కనీసం 51 హింసాత్మక ఘటనలు
నమోదు అయ్యాయి. రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని మతోన్మాద శక్తులు మైనారిటీలను వేధిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
 
ఒక్క జాయ్ మహాపాత్రో మాత్రమే కాదు గత కొన్ని రోజులుగా హిందూ వ్యాపారులు కూడా వరుసగా హత్యకు గురవుతున్నారు. నరసింగ్దీ జిల్లాలో 40 ఏళ్ల మణి చక్రవర్తి అనే కిరాణా షాపు యజమానిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వ్యాపారులు భారీ ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. 
 
జెస్సోర్ జిల్లాలో 38 ఏళ్ల రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ వ్యాపారిని దుండగులు తలపై కాల్చి దారుణంగా హత్య చేశారు. గత నెలలో 25 ఏళ్ళ దీపు చంద్ర దాస్ అనే యువకుడిని  దైవదూషణ నెపంతో మూకదాడి చేసి చంపడమే కాకుండా  అతని మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఈ అమానుష దాడులను భారత విదేశాంగ శాఖ  తీవ్రంగా ఖండించింది.
ముఖ్యంగా దీపు చంద్ర దాస్ హత్యను పాశవికమైన చర్యగా అభివర్ణించిన భారత్ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మైనారిటీల రక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం విస్మరిస్తోందని దౌత్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని హిందూ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకుని తమ ప్రాణాలను కాపాడాలని అక్కడి హిందువుల సంఘాలు వేడుకుంటున్నాయి.