భారత్‌లో వీసా సేవలను నిలిపివేసిన బంగ్లాదేశ్

భారత్‌లో వీసా సేవలను నిలిపివేసిన బంగ్లాదేశ్

భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ భారత్‌లోని తమ దౌత్య కార్యాలయాల్లో వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.  దీనితో పాటు అమెరికా విధించిన ‘వీసా బాండ్’ నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎమ్. తౌహిద్ హుస్సేన్ తెలిపారు.

డిల్లీ, కోల్‌కతా, అగర్తలాలోని తమ మూడు ప్రధాన మిషన్లలో వీసా విభాగాల్లో సేవలను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించినట్లు తౌహిద్ హుస్సేన్ తెలిపారు.  ఇది పూర్తిగా భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. అయితే, ముంబయి, చెన్నైలలోని బంగ్లాదేశ్ మిషన్లలో వీసా సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వ్యాపార, వర్క్ వీసాలు మినహా మిగిలిన సేవలను నిలిపివేసింది.

“అనివార్య పరిస్థితుల కారణంగా, న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ నుండి అన్ని కాన్సులర్,యు వీసా సేవలను తదుపరి నోటీసు వచ్చేవరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. ఏదైనా అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నాము” అని బంగ్లాదేశ్ హైకమిషన్ ఒక నోటీసులో తెలిపింది.

దౌత్య, భద్రతా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా చర్య తీసుకున్నారు. ఈ వారం ప్రారంభంలో, బంగ్లాదేశ్‌లోని ఖుల్నా,  రాజ్‌షాహిలోని రెండు వీసా దరఖాస్తు కేంద్రాలను భారతదేశం మూసివేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితి, భారత వ్యతిరేక నిరసనల పరంపరను కారణంగా చూపింది. ఒక రోజు తర్వాత, న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

కొత్త చర్యల ప్రకారం, వ్యాపార, ఉపాధి వీసాలు మినహా భారతీయ దరఖాస్తుదారులకు బంగ్లాదేశ్ అన్ని వీసా వర్గాలను నిలిపివేసింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌లో కాన్సులర్, వీసా సేవలు పూర్తిగా నిలిపివేశారు. ముంబై, చెన్నైలోని మిషన్లలో పర్యాటక వీసాలు, అనేక ఇతర వర్గాలను కూడా నిలిపివేశారు. సాధారణ వీసా, కాన్సులర్ సేవలను పునరుద్ధరించడానికి ఎటువంటి కాలక్రమం నిర్దేశించలేదు. ఇది సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్ సందర్శించాలనుకుంటున్న భారతీయ ప్రయాణికులకు అనిశ్చితిని కలిగిస్తుంది.