మనూ భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గం .. ఎబివిపి

మనూ భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గం .. ఎబివిపి
పాలన చేతగాక యూనివర్సిటీల భూములను అమ్ముకొని పబ్బం గడుపుకునే నీచమైన స్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విమర్శించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి యూనివర్సిటీల భూములను లాక్కోవడంపై చూపుతున్న శ్రద్ధను యూనివర్సిటీల అభివృద్ధిపై చూపడం లేదని ఎబివిపి భాగ్యనగర్ కార్యదర్శి  పృథ్వి తేజ ధ్వజమెత్తారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన 100 ఎకరాల భూములను గుంజుకున్నదని తెలిపారు. 
 
ఆ తర్వాత యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ కు చెందిన 400 ఎకరాలను కబ్జా చేయాలని చూస్తే ఎబివిపి ఉద్యమించడంతో  కుదరలేదని చెప్పారు. ఇప్పుడు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని ఆయన మండిపడ్డారు.  మణికొండ గ్రామంలోని సర్వేనెంబర్ 211, 212లోని 200 ఎకరాల భూములను అప్పటి కలెక్టర్ హెచ్ఎండిఎ కు కేటాయించారని తెలిపారు. 1998 జులై 23న ఆ భూములను హెచ్ఎండిఎ  మానుకు కేటాయించగా, భవనాలు, ఇతర అవసరాలకు యూనివర్సిటీ వినియోగిస్తున్నాడని ఆయన వివరించారు.
 
గత ఏడాది ఆగష్టు 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనారిటీ, ఆడిట్ కమిటీ సమావేశమై అందులో 50 ఎకరాలను జప్తు చేయాలని నిర్ణయించడం పట్ల ఎబివిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆ భూములను తిరిగి తీసుకొనేందుకు డిసెంబర్ 15న రిజిస్టర్ కు నోటీసు పంపారని చెప్పారు. గత ఏడాదే యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ భూముల విషయంలో సుప్రీంకోర్టు కర్రవాత పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ది రాలేదా? అని పృథ్వితేజ ప్రశ్నించారు.
 
ప్రశాంతమైన వాతావరణంలో సాగుతున్న యూనివర్సిటీ ఆవరణలోకి రియల్ ఎస్టేట్ మాఫియాను తీసుకొచ్చి వాతావరణాన్ని చెడగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనూ యూనివర్సిటీ భూములను కబ్జా చేయాలనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఎబివిపి డిమాండ్ చేసింది. లేనిపక్షంలో యూనివర్సిటీ భూములను కాపాడుకొనేందుకు ఉద్యమం చేబడతామని హెచ్చరించారు.