మొట్టమొదటి కాలుష్య నివారణ నౌక స‌ముద్ర ప్ర‌తాప్ జ‌ల‌ప్ర‌వేశం

మొట్టమొదటి కాలుష్య నివారణ నౌక స‌ముద్ర ప్ర‌తాప్ జ‌ల‌ప్ర‌వేశం
భార‌తీయ కోస్టు గార్డుకు చెందిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక స‌ముద్ర ప్ర‌తాప్ నౌక సోమవారం జ‌ల‌ప్ర‌వేశం చేసింది. గోవాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జలప్రవేశం కావించారు.  దక్షిణ గోవాలోని వాస్కోలోని గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (జిఎస్‌ఎల్‌ ) వద్ద ఈ నౌక జలాల్లోకి ప్రవేశించింది.  రక్షణమంత్రితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌, ఐసిజి డైరెక్టర్‌ జనరల్‌ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నౌక‌ను స్వ‌దేశీయంగా త‌యారు చేశారు. నౌకా నిర్మాణం, మారిటైం సామ‌ర్థ్యం క‌లిగిన దేశాల్లో భార‌త్ ఓ కీల‌క అడుగు వేసింది.  స‌ముద్ర ప్ర‌తాప్ నౌక‌ను గోవా షిప్‌యార్డు సంస్థ నిర్మించింది.  జిఎస్‌ఎల్‌ నిర్మించిన 114.5 మీటర్ల నౌకలో 60శాతం కంటే ఎక్కువ స్వదేశీ సామాగ్రిని వినియోగించారు. 4,200 టన్నుల బరువు కలిగిన ఈ నౌక 22 నాట్లకంటే ఎక్కువ వేగంతో 6,000 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించగలదని అధికారులు తెలిపారు.
సముద్ర కాలుష్య నియంత్రణ నిబంధనలు, సముద్ర చట్ట అమలు, భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండల భద్రతను నిర్వహించనుందని పేర్కొన్నారు. ఇండియ‌న్ కోస్టు గార్డు వ‌ద్ద ఉన్న నౌక‌ల్లో స‌ముద్ర ప్ర‌తాప్ అతిపెద్ద నౌక‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ది.  మారిటైం పొల్యూష‌న్‌, ఫైర్ ఫైటింగ్‌, స‌ముద్ర , ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌తో పాటు కోస్తా తీర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ది.  మారిటైం స‌వాళ్ల‌ను ఎదుర్కొనే రీతిలో స‌ముద్ర ప్ర‌తాప్ యుద్ధ‌నౌక‌ను త‌యారు చేసిన‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 
 
స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసే నౌక‌ల్లో 90 శాతం స్వంత వ‌స్తువుల‌ను వాడే రీతిలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్రాథ‌మికంగా పొల్యూష‌న్ కంట్రోల్ కోసం దీన్ని డిజైన్ చేశామ‌న్నారు. స‌ముద్ర ప‌ర్యార‌వ‌ణ ర‌క్ష‌ణ వ్యూహాత్మ‌క అవ‌స‌ర‌మ‌ని, నైతిక బాధ్య‌త అని ఆయ‌న పేర్కొన్నారు.అడ్వాన్స్‌డ్ ఎన్విరాన్మెంట‌ల్ రెస్పాన్స్ సామ‌ర్థ్యం ఉన్న దేశాల్లో ఇప్పుడు భారత్ కూడా అగ్ర‌భాగాన నిలుస్తుంద‌ని రక్షణ మంత్రి చెప్పారు. స‌ముద్రాలు స్వ‌చ్ఛంగా ఉంటే, వాణిజ్యం సుర‌క్షితంగా సాగుతుంద‌ని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత‌, స్థిర‌మైన మారిటైం ఎన్విరాన్మెంట్ కోసం పాటుప‌డుతున్న‌ట్లు చెప్పారు. సుముద్ర ప్ర‌తాప్ నౌక సుమారు 114.5 మీట‌ర్ల పొడుగు ఉంటుంది.4200 ట‌న్నులు బ‌రువు ఉన్న‌ది. సుమారు 22 నాట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.