వేర్పాటువాదంపై సామాన్యుల పోరాటాలను వివరించే ‘అస్సాం గాథలు’

వేర్పాటువాదంపై సామాన్యుల పోరాటాలను వివరించే ‘అస్సాం గాథలు’

 1990వ దశకంలో అస్సాం రాష్ట్రంలో తీవ్రతరమైన ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఆరెస్సెస్ స్పూర్తితో ధీటుగా ఎదుర్కొన్న సామాన్య వ్యక్తుల జీవితాల్లోని పోరాట ఘట్టాలు వివరిస్తూ  సీనియర్ పాత్రికేయులు, ఆరెస్సెస్ మాజీ ప్రచారక్రాకా సుధాకర్ రావు రచించిన “అస్సాం గాథలు” పుస్తకాన్ని ప్రముఖ రచయిత రతన్ శారదా  ఆవిష్కరించారు.  గత ఐదు దశాబ్దాలుగా చర్చ్ అండదండలతో వేర్పాటువాద శక్తులు ఆ ప్రాంతంలో సామాజిక అస్థిరతకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

 బ్రిటిష్ మద్దతుతో ముస్లింలు అస్సాం ప్రాంతంలోకి పెద్ద ఎత్తున వలస వెళ్లడం, 1930 – 1940 ప్రాంతాల్లో అస్సాంలోని ప్రాంతాలలో ముస్లిం జనాభా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలైన అంశాలు ప్రస్తావిస్తూ బ్రిటిష్ వలసవాదులు ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయతించినట్టు తెలిపారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన రిటైర్డ్ కల్నల్ ఎన్. ఎస్. రావు  జాతీయ ఐక్యత కోసం పాటుపడిన వారిలో ఆరెస్సెస్ ప్రచారకులది నిశ్శబ్ద పాత్ర అని, వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోకుండా పనిచేసుకుంటూ పోయే లక్షణం కారణంగా వారికి కీర్తిప్రతిష్టల పట్టింపు ఉండదని కొనియాడారు.

కుటుంబానికి, సౌకర్యాలకు దూరంగా ఉంటూ, ప్రమాదకర వేర్పాటువాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పనిచేసే సంఘ ప్రచారకులు, సంఘ కార్యకర్తల త్యాగాలు ప్రచారానికి దూరంగా ఉంటాయని చెప్పారు. పుస్తక రచయితకు దేశంలోని ప్రాంతీయ భాషలతో పాటు అస్సాంలోని స్థానిక తెగలకు సంబంధించిన వివిధ భాషలపై పట్టు ఉందని కల్నల్ రావు ప్రశంసిన కల్నల్ రావు, ‘అస్సాం గాధలు’ పుస్తకం రచయితకు గల  లోతైన అవగాహన, జీవిత అనుభవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ, అస్సాంలోని పాఠశాల పాఠ్యపుస్తకాలు 1975 దాకా మహాత్మా గాంధీని ఆరెస్సెస్ కార్యకర్తలే హత్య చేశారంటూ విద్యార్థులకు తప్పుడు బోధనలు నూరిపోశాయని అన్నారు. ఇలాంటి తప్పుడు కథనాల కారణంగా సంఘ్ ప్రచారక్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. 1980, 1990లలో అస్సాంలో వేర్పాటువాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అనేక మంది ఆర్ఎస్ఎస్  ప్రచారకులు, స్వయంసేవకులు ఎదుర్కొన్న తీవ్ర కష్టాలను ‘అస్సాం గాథలు’ పుస్తకంలో వివరించినట్టు తెలిపారు.

పుస్తకం ప్రచురించిన  సంవిత్ ప్రకాశన్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. పరిమల వివరిస్తూ భారతీయ చరిత్ర, సంస్కృతిపై ఉన్నత ప్రమాలనతో కూడిన పరిశోధన, మేధోపరమైన సంవాదాలతో కూడిన రచనల ప్రచురణలకు కృషి చేస్తున్నామని చెప్పారు.  2020లో ప్రస్థానం మొదలుపెట్టిన సంవిత్ ప్రకాశన్ ద్వారా  వక్రీకరణలకు, నిర్లక్ష్యానికి గురైన చరిత్రను సరిదిద్ది, అందులోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కోణాలను ప్రచురించడంపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం, ఆంగ్ల భాషల్లో 60కి పైగా రచనలను ప్రచురించామని తెలియజేసారు. యువతలో పాఠకుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.