భారతీయ మూలాలు ఉన్న జోహ్రన్ మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారంం చేశారు. మన్‌హటన్‌లోని చరిత్రాత్మక ‘సిటీ హాల్’ సబ్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన మమ్దానీ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్‌పై చేయి వేసి ప్రమాణం చేశారు. న్యూయార్క్ నగర 112వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.
కేవలం 34 ఏళ్ల వయసులోనే మేయర్ పదవిని చేపట్టిన మమ్దానీ, అరుదైన ఘనతలు సాధించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మొదటి ముస్లిం నేతగా చరిత్ర సృష్టించారు. తొలి దక్షిణాసియా (సౌత్ ఏషియన్) మేయర్‌గా నిలిచారు. అంతేకాదు, గత శతాబ్దానికి పైగా కాలంలో అత్యంత పిన్న వయసులో మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. పదవి దక్కించుకున్న తొలి భారత- అమెరికన్ ముస్లింగా నిలిచారు.
‘సిటీ హాల్’ సబ్వే స్టేషన్లో ప్రమాణం అనంతరం మాట్లాడిన మమ్దానీ, ఇది నిజంగా జీవితంలో ఒక గొప్ప గౌరవమని, అదృష్టమని పేర్కొన్నారు. ఆ వేదికను ఎంపిక చేసుకోవడంపై మమ్దానీ మాట్లాడుతూ, “పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నగర జీవనానికి ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తుంది. ఇది న్యూయార్క్ ఆరోగ్యానికి, వారసత్వానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
అదే సమయంలో నగర రవాణా శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్) కొత్త కమిషనర్‌గా అనుభవజ్ఞుడైన సిటీ ప్లానర్ మైఖేల్ ఫ్లిన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్ సమక్షంలో సిటీ హాల్లో జరిగే బహిరంగ వేడుకలో మరింత ఘనంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్‌కు కొత్త మేయర్‌గా నిలిచారు. భారతీయ మూలాలున్న మమ్దానీ బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.

More Stories
45 ఏళ్లుగా పడిపోతున్న జపాన్ బాలల జనాభా
యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి
ఓ దుండగుడు వైట్‌హౌస్ భద్రతా సిబ్బందిపై కాల్పులు