భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే అంశమలపై చర్చించేందుకు వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించనున్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆయనను సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఈ విషయం చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు.
ఈ సందర్భంగా నితిన్ నబిన్ సిన్హా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలు చేశారు. సమిష్టికృషితో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని రామచందర్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను కావాలనే తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు.

More Stories
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
ప్రపంచవ్యాప్తంగా ‘హిందూ జీవన విధానం’కు ఆదర్శంగా నిలుద్దాం
ప్రజా సమస్యలపై నెలరోజుల అసెంబ్లీ… రేవంత్ కు బిజెపి సవాల్