తిరుమల కొండపైనే కాదు కొండ కింద కూడా వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.
వైఎస్సార్సీపీ హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంద కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరల (9 లేయర్లు)తో తాపడం చేయాల్సి ఉండగా, రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి.
విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి.
ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై ఆరా తీస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం.
సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుమల వెళ్లే యాత్రికులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వేలాదిమందియాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి కోవెల ఎప్పుడూ సందడిగానే ఉంటుంది.

More Stories
కక్ష్యలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం
ఐపీఎస్ సునీల్ కుమార్ బర్తరఫ్ కై రఘురామ డిమాండ్!
విశాఖలో భారీ గోమాంసం రాకెట్ గుట్టురట్టు