తెలంగాణలోనే తదుపరి ‘ఎస్ఐఆర్’

తెలంగాణలోనే తదుపరి ‘ఎస్ఐఆర్’
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఇప్పటికే దేశంలోని 13 రాష్ట్రాల్లో పూర్తి చేశామని, తదుపరి ఈ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌కుమార్‌ వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. 
 
ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణలోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బిఎల్‌ఒ)లతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్‌కుమార్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల వ్యవస్థలో బిఎల్‌ఒలదే కీలకపాత్ర అని చెప్పారు. 
 
ఓటర్‌ కార్డులకు ఆధార్‌ లింక్‌ చేయాలనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఆధార్‌ కార్డు కేవలం గుర్తింపు కార్డు అని, సిటిజన్‌షిప్‌ కార్డు కాదని పేర్కొన్నారు. దాన్ని ఓటర్‌ కార్డుకు లింక్‌ చేయడం కుదరదని చెప్పారు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఒలే వెన్నెముకని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా శుద్ధి విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 
 
తెలంగాణ విస్తీర్ణం కెనడా కంటే పెద్దదని, ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి పట్టణ ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉత్సాహంగా క్యూల్లో నిలబడి ఓటు హక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారని వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో సగటున ఒక్కో బిఎల్‌ఒకు 930 మంది ఓటర్లు వస్తారని తెలిపారు.  ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ విషయంలో తెలంగాణ త్వరలోనే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎన్నికలు పూర్తిగా దేశ చట్టాల ప్రకారమే నిర్వహించబడుతున్నాయని, ఎన్నికల చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు.