* నక్సలిజం అనే విష సర్పమే బస్తర్ లో అభివృద్ధికి అడ్డంకి
ఈసారి బస్తర్ ఒలింపిక్స్‌లో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో 700 మందికిపైగా మాజీ మావోయిస్టులు పాల్గొన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వారంతా విభజనకు బదులు ఐక్యతను, వినాశనానికి బదులు వికాసాన్ని ఎంచుకున్నారని ఆయన అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ‘బస్తర్ ఒలింపిక్స్ 2025’ ముగింపు వేడుకల్లో పాల్గొంటూ 2026 బస్తర్ ఒలింపిక్స్ కల్లా బస్తర్ ప్రాంతానికి మావోయిజం నుంచి పూర్తి విముక్తి లభిస్తుందని చెప్పారు.
ఈ పోటీలను స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన మాజీ మావోయిస్టులను వారు ఎంపిక చేసి అత్యుత్తమ శిక్షణను అందిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వారిని పంపుతారు. 2036లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం కూడా వారిని ఇప్పటి నుంచే సిద్ధం చేస్తారు.
నక్సలిజం అనే విష సర్పమే బస్తర్ ప్రాంతంలో అభివృద్ధిని ఇన్నేళ్లుగా అడ్డుకుందని, నక్సలిజం అంతం కాగానే ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన నూతన అధ్యాయం మొదలవుతుందని అమిత్‌షా తెలిపారు. నక్సలిజం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. మావోయిస్టులుగా మారి ఆయుధాలను చేతపట్టిన వారికి కానీ, మావోయిస్టులను ఎదుర్కొనే భద్రతా బలగాలకు కానీ నక్సలిజం వల్ల ప్రయోజనం లభించదని ఆయన చెప్పారు.
శాంతి మార్గం మాత్రమే దేశ అభివృద్ధికి బాటలు వేయగలదని పేర్కొన్నారు. 2026 మార్చి 31కల్లా నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యాన్ని మోదీ సర్కారు నిర్దేశించుకుందని అమిత్‌షా తెలిపారు. ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌ను రాబోయే ఐదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందని వెల్లడించారు. ఇప్పటికీ మావోయిస్టుల్లోనే ఉన్నవారు ఇకనైనా జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నక్సలిజాన్ని వదిలేసే వారికి మెరుగైన పునరావాస ప్యాకేజీలను అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. మావోయిస్టుల రెడ్ టెర్రర్‌ను పూర్తిగా అంతం చేసేందుకు మోదీ సర్కారు నిర్దేశించుకున్న గడువు సమీపిస్తోందని అమిత్‌షా గుర్తుచేశారు. 2030 డిసెంబరుకల్లా ఈ ఏడు జిల్లాలను దేశంలోనే అత్యంత వికసిత గిరిజన జిల్లాలుగా తీర్చిదిద్దుతామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఈ జిల్లాల్లోని ప్రజలకు ఇళ్లు, విద్యుత్, మరుగుదొడ్లు, నల్లా నీరు, ఎల్‌పీజీ కనెక్షన్, రోడ్లు, ప్రతి 5 కి.మీకు ఒక బ్యాంకు, ప్రాథమిక ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రతినెలా ఉచిత ఆహార ధాన్యాలు, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని అమిత్‌షా వెల్లడించారు.
“బస్తర్ స్వఇప్పుడు భయం స్థానంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఒకప్పుడు తుపాకీ చప్పుళ్లు ప్రతిధ్వనించిన పల్లెల్లో నేడు స్కూలు బెల్స్ మోగుతున్నాయి” అని గుర్తు చేశారు. అభివృద్ధి అనేది కలగా మిగిలిన బస్తర్ ప్రాంతంలో, ప్రస్తుతం రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని, లాల్ సలామ్ నినాదం స్థానంలో భారత్ మాతా కీ జై నినాదాలు వినిపిస్తున్నాయని అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆపరేషన్లు మంచి ఫలితాలను ఇచ్చాయని చెబుతూ కేవలం మావోయిస్టులను అంతం చేయాలనే లక్ష్యంతో మేం పనిచేయలేదని, వారిని జనజీవన స్రవంతిలోకి సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. “మా ప్రయత్నం ఫలించి గత రెండేళ్లలో 2వేల మందికిపైగా మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో గిరిజన తెగల నేతలు కూడా కీలక పాత్ర పోషించారు. ఆ నేతల పిలుపు మేరకు మావోయిస్టులలో ఉన్న ఎంతోమంది యువత ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు” అని చెప్పారు.
మావోయిస్టుల్లో మిగిలి ఉన్నవారినీ జనం మధ్యకు తీసుకొచ్చేందుకు ఇకపైనా కృషిని కొనసాగించాలని గిరిజన తెగల నేతలను నేను ఈసందర్భంగా అమిత్ షా ఆకోరారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్, విజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

More Stories
బ్రిక్స్ దేశాలను డిజిటల్ కరెన్సీలతో అనుసంధానం.. భారత్ యత్నం
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ
రివాల్వర్‌తో కాల్చుకుని కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య