నేపాల్‌లో జెన్‌జెడ్‌ నిరసనలతో 42 బిలియన్‌ డాలర్ల నష్టం

నేపాల్‌లో జెన్‌జెడ్‌ నిరసనలతో 42 బిలియన్‌ డాలర్ల నష్టం

నేపాల్‌లో జెన్‌జెడ్‌ నిరసనలతో 42 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు 586 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ప్రకటన శుక్రవారం తెలిపింది. నష్టాలను అంచనా వేయడానికి నియమించిన అధికారిక కమిటీ ప్రకారం పునర్‌నిర్మాణ ఖర్చు 252 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందని నేపాల్‌ తాత్కాలిక ప్రధాని కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో తెలిపింది. కమిటీ కోఆర్డినేటర్, జాతీయ ప్రణాళికా సంఘం కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న రబిలాల్ పంథా నివేదిక సారాంశాన్ని ప్రధానమంత్రి సుశీల కర్కీకి అందించారు.

గత సెప్టెంబర్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో జెన్‌ జెడ్‌ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమం ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో ప్రముఖ సింఘా దర్బార్‌ కార్యాలయ సముదాయం, ప్రధాని కార్యాలయం, సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ భవనం, రాజకీయ నేతల ప్రైవేట్‌ నివాసాలు, వారి సన్నిహితులకు చెందిన వ్యాపార సముదాయాలు సహా ప్రభుత్వ, ప్రైవేట్‌ మౌలిక సదుపాయాలను ఆందోళనకారులు తగులబెట్టి ధ్వంసం చేశారు. 

పునర్‌నిర్మాణం కోసం వనరులను సమీకరించడానికి తాత్కాలిక ప్రభుత్వం ఒక అధికారిక నిధిని ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు ప్రజల నుండి, వివిధ సంస్థల నుండి మిలియన్‌ డాలర్ల కన్నా తక్కువ నిధులు సేకరించిందని అధికారులు తెలిపారు. సింఘా దర్బార్‌, రాష్ట్రపతి భవన్‌, సుప్రీంకోర్టు,  కీలక మంత్రిత్వ శాఖల పునర్నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి చెందిన  సీనియర్‌ ఇంజనీర్‌ చక్రవర్తి కాంత తెలిపారు. 

పాక్షికంగా దెబ్బతిన్న కొన్ని భవనాల మరమ్మత్తులు ఇప్పటికే పూర్తయ్యాయని, అవి తిరిగి వాడకంలోకి వచ్చాయని పేర్కొన్నారు. పూర్తిగా ధ్వంసమైన భవనాల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని, వాటికోసం అవసరమైన  నివేదికలు, డిజైన్లు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వం 2026 మార్చి 5న కొత్త పార్లమెంటరీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

జెన్‌జెడ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాని కె.పిశర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.  మూడు నెలలపాటు కొనసాగిన హింసాత్మక ఘటనల్లో 77మంది మరణించగా, 2,000మందికి పైగా గాయపడ్డారు.