2020లో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ ఆర్ సి)లకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లలో 53 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్ తదితరులపై మునుపటి ఐపీసీ సెక్షన్లతో పాటు ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరు దాదాపు ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నారు.
బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా, కేసు దర్యాప్తులో, విచారణలో జరిగిన ఆలస్యానికి నిందితులే ప్రధాన కారణమని ఏఎస్‌జీ రాజు ధర్మాసనానికి వివరించారు. ఈ జాప్యాన్ని ఇప్పుడు బెయిల్ కారణంగా చూపించలేరని స్పష్టం చేశారు. ‘వారు సాగదీస్తే దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇది అని రాజు వాదించారు.
శర్జీల్ ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణను బలపరచేందుకు పోలీసులు సుప్రీం కోర్టులో సంబంధిత వీడియో క్లిప్స్‌ను ప్రదర్శించారు. ఇమామ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని గుర్తు చేశారు. నిరసనల అసలు ఉద్దేశ్యంపై కూడా ఢిల్లీ పోలీసులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇవి సాధారణ ప్రజా ఆందోళనలు కావని చెప్పారు ఏఎస్‌జీ రాజు.
హింసతో కూడిన సమన్విత ప్రణాళిక అని, అంతర్జాతీయ మీడియాలో ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను ఉపయోగించుకున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించడమే వీరి యాజమాన్య లక్ష్యమంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ కేసు కేవలం సిఏఏ వ్యతిరేక ఉద్యమం కాదని, మతరంగ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే కుట్ర అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదించారు. నిరసనల పేరుతో దాగి ఉన్న పెద్ద ప్లాన్ ఇదని తెలిపారు. హింసకు దారి తీసిన సంఘటనలు ఒక్కసారిగా జరగలేదని, నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, సమావేశాలు, విభిన్న ప్రాంతాల్లో జరిగిన కార్యకలాపాలు అని ఆయన పేర్కొన్నారు.

More Stories
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!
కర్ణాటకలో డ్రగ్స్ నేరాలకు పాల్పడితే కూల్చివేతలే!
తమిళనాడు న్యాయమూర్తిపై అభిశంసన.. హిందూ వ్యతిరేకతే లౌకికవాదమా!