బంగ్లాదేశ్ నిరసనలకు నిధులిచ్చిన బిడెన్ ప్రభుత్వం

బంగ్లాదేశ్ నిరసనలకు నిధులిచ్చిన బిడెన్ ప్రభుత్వం
గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీనికిగాను మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్‌ నవంబర్‌ 17న మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై హసీనా కుమారుడు సజీబ్‌ వాజెద్‌ స్పందిస్తూ తన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌లో నిరసనలు జరగడానికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చిందని ఆరోపించారు. 
 
అప్పటి బైడెన్‌ ప్రభుత్వం హసీనా పాలన మార్పు కోసం నిరసనలు జరపడానికి మిలియన్‌ డాలర్లను సమకూర్చిందని నిందించారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బంగ్లాదేశ్‌ విషయంలో వైఖరి మారిందని ఆయన తాజాగా మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజెద్‌ అమెరికాలో నివశిస్తున్నారు. తన తల్లి హసీనా భారత్‌లో ఆశయ్రం పొందుతున్నారు. 
 
అమెరికాలోని గత బైడెన్‌ ప్రభుత్వం బంగ్లాదేశ్‌ పాలన మార్పు కోసం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా మిలియన్ల డాలర్లను ఖర్చు చేసినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే మీడియా సమావేశంలో వెల్లడించారని వాజెద్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పరిపాలన కంటే బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద ముప్పు, ఇస్లామిజం పెరుదలపై ట్రంప్‌ ఎక్కువ ఆందోళన చెందారు. దీంతో బంగ్లాదేశ్‌ పట్ల అమెరికా వైఖరి ఖచ్చితంగా మారిపోయిందని వాజెద్‌ తెలిపారు. 
 
ఆమెకు మరణశిక్ష విధించిన తర్వాత భారత్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? అని వాజెద్‌ను మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘భారత్‌ ఎప్పుడూ స్నేహితుడిగానే ఉంది. సంక్షోభ సమయంలో భారత్‌ నా తల్లి ప్రాణాన్ని కాపాడింది. ఆమె బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టకపోతే ఉగ్రవాదులు ఆమెను చంపాలని ప్లాన్‌ చేశారు. నా తల్లి ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీ  ప్రభుత్వానికి నేను ఎప్పటికీ కృతజ్ఞడును’ అని చెప్పారు. 
 
“బంగ్లాదేశ్‌లో ఎన్నిక కాని, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం ఉంది. నా తల్లిని దోషిగా నిర్ధారించడానికి ఆమె విచారణను వేగవంతం చేయడానికి వారు చట్టాలను సవరించారు. చట్టాలను చట్టవిరుద్ధంగా సవరించారు. నా తల్లి తరపున వాదనలు వినిపించడానికి న్యాయవాదులను నియమించుకోవడానికి అనుమతించబడలేదు. ఆమె తరపు న్యాయవాదలను కోర్టుల్లోకి కూడా అనుమతించలేదు” అని గుర్తు చేయసారు. 
 
రాజకీయ జోక్యంతో విచారణ కూడా రాజీపడిందని పేర్కొంటూ విచారణకు ముందే 17 మంది న్యాయమూర్తులను కోర్టులో తొలగించారని ఆయన గుర్తు చేశారు. విచారణకు కొత్త న్యాయమూర్తులను నియమించారని, వీరిలో కొందరికి బెంచ్‌లో అనుభవం లేదని చెబుతూ ఇదంతా రాజకీయ జోక్యంతోనే జరిగిందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు తన తల్లిని అప్పగించాలంటే న్యాయ విచారణ ప్రక్రియ తగిన విధంగా జరగాలని, కనై అలా జరగలేదని వాజెద్‌ ఆరోపించారు.