భారత్​పై సుంకాలు తగ్గించబోతున్నాం

భారత్​పై సుంకాలు తగ్గించబోతున్నాం
“రష్యా చమురు కారణంగా ప్రస్తుతం భారత్​పై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అందుకే మేం సుంకాలను తగ్గించబోతున్నాం. సమయానుకూలంగా, మేం వాటిని తగ్గిస్తాం” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ప్రకటించారు. భారత్​పై అమెరికా మొదట 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, తర్వాత 50 శాతానికి పెంచింది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుందుకే ఈ సుంకాలను పెంచినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమకు అద్భుతమైన సంబంధం ఉందని  డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే అందరికీ మేలు చేసే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి రెండు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఒక దశలో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను తగ్గిస్తుందని కూడా పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“మేం భారత్‌తో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది మునుపటి దానికంటే భిన్నమైనది. ప్రస్తుతం వారు నన్ను ఎక్కువగా ఇష్టపడటం లేదు. కానీ త్వరలో మళ్లీ మనల్ని ఇష్టపడతారు. మేం న్యాయమైన ఒప్పందం సాధించబోతున్నాం. వారు చాలా మంచి సంధానకర్తలు. అందుకే, సెర్జియో, నువ్వు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. అందరికీ లాభకరంగా ఉండే ఒప్పందం దాదాపు సిద్ధమవుతోంది అని నా నమ్మకం” అని తెలిపారు.

ప్రధాని మోదీతో తమకుఅద్భుతమైన సంబంధం ఉందని, సెర్జియో గోర్ ఆ బంధాన్ని మరింత బలపరిచారని ట్రంప్ పేర్కొన్నారు. “ఎందుకంటే ఆయన ఇప్పటికే మోదీతో స్నేహపూర్వక సంబంధం ఏర్పరుచుకున్నారు. సెర్జియో గోర్ భారత్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధం అత్యంత ముఖ్యమైనది” అని చెప్పారు. 

“భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మధ్యతరగతి కలిగిన దేశం. ఇది అద్భుతమైన దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇది ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి. 1.5 బిలియన్ జనాభా. చైనాకు 1.4 బిలియన్ ఉంది. ఇవి రెండు పెద్ద దేశాలు. రాయబారిగా సెర్జియో మా దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, అమెరికా పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారు” అని ట్రంప్ వివరించారు.