ష‌ట్‌డౌన్‌తో ఒకేరోజు 1200 విమానాలు రద్దు

ష‌ట్‌డౌన్‌తో ఒకేరోజు 1200 విమానాలు రద్దు
అమెరికాలో చరిత్రలో ప్ర‌భుత్వ ష‌ట్‌డౌన్ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్‌డౌన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. షట్‌డౌన్‌ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, టీఎస్‌ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్‌ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. 
దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.  పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ప్ర‌భుత్వం విమాన సేవ‌ల్లో కోత విధించింది. ఈ విష‌యాన్ని దేశ రవాణా శాఖ మంత్రి సీన్‌ డఫీ ఇటీవ‌లే ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే అట్లాంటా, న్యూవార్క్, డెన్వర్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ స‌హా 40 ప్రాంతాల్లో 10 శాతం విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.
 
దీనిని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో శుక్ర‌వారం ఒక్క‌రోజే దేశంలో ఏకంగా 1,200 ఫ్లైట్లు ర‌ద్ద‌య్యాయి. ఇది గురువారం కంటే ఐదు రెట్లు ఎక్కువ. రేగన్ జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. 18 శాతం అంటే 81 విమానాలు రద్దయ్యాయి. షికాగో ఓ హేర్‌, అట్లాంటా, డల్లాస్, డెన్వర్‌ వంటి కేంద్రాల్లో కూడా 3% వరకు విమానాలు రద్దయ్యాయి. 
 
విమానాల ర‌ద్దుతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితులు ఎప్పుడూ చూడ‌లేద‌ని పేర్కొంటున్నారు. సేనేట్‌లో రిప‌బ్లిక‌న్లు ప్రవేశ‌పెట్టిన ఫెడ‌ర‌ల్ నిధుల‌కు చెందిన బిల్లుకు ఆమోదం ద‌క్కకపోవడంతో అక్టోబర్‌ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.