బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం

బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం

బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి వివాదం సృష్టించాయి.  భారత సైన్యం “దేశ జనాభాలో 10 శాతం మంది నియంత్రణలో ఉంది” అని మంగళవారం ఉన్నత కులాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

బీహార్‌లో జరిగిన ఓ బహిరంగ సభలోలోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ, భారతదేశ జనాభాలో 90 శాతం మంది దళితులు, మహాదళితులు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారని, అయితే మిగిలిన 10 శాతం మంది మాత్రమే సైన్యంలో పదవులు సహా చాలా ఉద్యోగాలను కలిగి ఉన్నారు” అని చెప్పారు. 
 
“జనాభాలో దాదాపు 90 శాతం మంది దళిత, మహాదళిత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, గిరిజన,మైనారిటీ వర్గాల నుండి వచ్చారు. అయినప్పటికీ, మీరు దేశంలోని టాప్ 500 కంపెనీలను పరిశీలిస్తే, ఈ వర్గాల నుండి ఎవరూ నాయకత్వ పదవులలో కనిపించరు. దాదాపు అన్ని ఉన్నత పదవులు మిగిలిన 10 శాతం జనాభాకు చెందిన వ్యక్తులచే నిర్వహించబడుతున్నాయి. వారు ఉద్యోగాలు మరియు బ్యాంకు డబ్బును పొందడంలో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. న్యాయవ్యవస్థలో కూడా ఇదే నమూనా కనిపిస్తుంది మరియు వారు సైన్యాన్ని కూడా నియంత్రిస్తారు,” అని ఆయన ఆరోపించారు.

సమాజంలో సమాన హక్కుల కోసం, అధికార వనరుల సమతుల్య పంపిణీ అవసరమని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సహా అనేక పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.  ఆయన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని, దేశ సంస్థలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. “రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు సైన్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు” అని పార్టీ నాయకులు విమర్శించారు.

సైన్యాన్ని కుల ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి మండిపడింది.  “రాహుల్ గాంధీ కూడా సిగ్గులేనివాడు, మోసపూరితంగా సిగ్గులేనివాడు.. ఈ క్లిప్‌లో అతని మాట వినడం వల్ల ఈ విఫలమైన, ఎప్పటికీ ప్రధానమంత్రి పదవికోసం వేచిఉండే ఆయన ఇప్పుడు సైన్యాన్ని కుల ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎల్‌ఓపి ఎంతటి అప్రతిష్ట.. నిస్సహాయమైనది,” అని బిజెపి ప్రతినిధి సంజు వర్మ  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇదే రాహుల్ గాంధీ గతంలో చేసిన చైనా వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. “చైనా సైనికులు మన సైనికులను కొడుతున్నారు” అని ఆయన చేసిన వ్యాఖ్యపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇంతలోనే బిహార్ ప్రచారంలో చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన మళ్లీ విమర్శల వలయంలో చిక్కుకున్నారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు బిహార్ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.