ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్రమే కాదు. ఒక హెచ్చరిక కూడా. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ డాటా ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 218 కంపెనీలు సుమారు 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు వరకు ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన దిగ్గజ సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ సేవలు, లాభదాయకతపై దృష్టి సారించేందుకు సిబ్బందిని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
ఇంటెల్ ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 22 శాతం అంటే 24,000 మందిని తొలగిస్తున్నది. అమెజాన్ ఆపరేషన్స్, హెచ్ఆర్, క్లౌడ్ విభాగాల్లో 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది. ఇక మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్, సాఫ్ట్వేర్ విభాగాల్లో సుమారు 9,000 మందిని తొలగించి తమ వనరులను ఏఐ, క్లౌడ్ ఆవిష్కరణల వైపు మళ్లిస్తున్నది.
గూగుల్, మెటా సంస్థలు ఆండ్రాయిడ్ హార్డ్‌వేర్, ఎక్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఒరాకిల్ కూడా యూఎస్‌లో వందలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. భారతదేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సైతం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు 20,000 ఉద్యోగాలను తగ్గించుకుంది.
టెక్ సెక్టార్లో కొనసాగుతున్న కొలువుల కోతలు (లేఆఫ్స్) ఉద్యోగులు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులపైనే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూయించవచ్చని టెక్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. జీడీపీ వృద్ధిలో వినియోగదారుల కొనుగోలు శక్తి అనేది కీలకపాత్ర పోషిస్తున్నది. కొనుగోళ్లు పెరిగితేనే వస్తు, సేవలకు గిరాకీ పెరుగుతుంది. అప్పుడే విపణిలో ద్రవ్య చలామణీ కొనసాగుతుంది.
గడిచిన కొన్నేండ్లలో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, బంగారం తదితర కీలక ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగులే కీలకంగా ఉండేవారు. టెక్ సెక్టార్లో వేతనాలు, ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే, గడిచిన కొన్నేండ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 ఒక్క ఏడాదిలోనే భారత్‌లో 50 వేల మంది టెక్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. రానున్న ఆరు నెలల్లో మరో 50 వేల మందికి ఉద్వాసన ఉండనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే, జీడీపీ వృద్ధిలో కీలకమైన సేవా రంగం, రియల్ ఎస్టేట్‌లో ఐటీ ఉద్యోగుల ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

More Stories
టాటా ట్రస్ట్స్ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ