జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే నేషనల్ కాన్ఫరెన్స్, ప్రతిపక్ష బిజెపి సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. 2019లో 370వ అధికరణను రద్దు చేయడంలో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పాత్రపై ఇరు పక్షాల మధ్య వాడిగా వేడిగా చర్చ సాగింది. మాలిక్ కొన్ని రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేశారని, వాటిని చరిత్రలో లిఖించాల్సి వుందంటూ కొంతమంది ఎన్‌సి ఎంఎల్‌ఎలు అనడంతో బిజెపి సభ్యులు నిరసన తెలిపారు.
మాలిక్‌తో సహా ఈ మధ్యకాలంలో మరణించిన వారి గౌరవార్ధం సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఆ సందర్భంగా ఈ చర్చ జరిగింది. పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర 10వ, చివరి గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. 370వ అధికరణ రద్దులో ఆయన పాత్ర వివాదాస్పదమంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంఎల్‌ఎ బషీర్ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని బిజెపి సభ్యుడు శామ్‌లాల్ శర్మ కోరారు. చనిపోయిన వారిని గౌరవించాలంటూ సూచించిన స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఎన్‌సి సభ్యుడి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించడానికి ఆమోదించలేదు. అనంతరం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, మాలిక్ తాను మంచి చేస్తున్నానని భావించి వుండొచ్చని చెప్పారు.
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మిర్ మాట్లాడుతూ మాలిక్ మంచినేత అని, చివరిలో ప్రజలకు నిజం తెలియచేసేందుకు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. పిడిపి ఎంఎల్‌ఎ రఫీక్ స్పందిస్తూ తమకు మాలిక్‌తో విభేదాలున్నాయని చెప్పారు. ఈ ప్రపంచంలో లేని వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ప్రతిపక్ష నేత సునీల్ శర్మ హితవు చెప్పారు. సిపిఎం ఎంఎల్‌ఎ తరిగామి మాట్లాడుతూ గౌరవంతోపాటు ప్రభుత్వ బాధ్యతలను చేపట్టిన వ్యక్తి చర్యలను కూడా అంచనా వేసుకోవాలని చెబుతూ మర్యాదపూర్వకమైన పరిధుల్లో వుండి కూడా విమర్శలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
అయోధ్య దర్శన సమయాల్లో మార్పులు!