సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. అయితే, స్థానిక ఎన్నికల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 3న విచారణ ఉన్నందున అప్పటివరకు వేచి చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయమై వచ్చే నెల 7న మరోసారి మంత్రివర్గం సమావేశం కావాలని నిర్ణయించారు.
న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకే ముందుకెళ్లాలని అభిప్రాయపడింది. బిహార్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాతే బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం మంచిదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని మంత్రివర్గం తీర్మానించింది. కేబినెట్ సమావేశం ముగిశాక మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహాలపై గంటకుపైగా చర్చించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కచ్చితంగా గెలవాలని మంత్రులందరూ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈనెల 6న జరిగిన కేబినెట్ సమావేశాకి గైర్హాజరైన మంత్రి కొండా సురేఖ గురువారం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి సైతం ముఖ్య కార్యదర్శి హోదాలో కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.
“స్థానిక ఎన్నికలపై కూడా కేబినెట్లో చర్చించాం. వచ్చే నెల 3న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ఉంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. వచ్చే నెల ఏడో తేదీన కేబినెట్ భేటీ జరపాలని నిర్ణయించాం. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆర్డినెన్స్ తెస్తాం” అని మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు.
కాగా, మంత్రుల మధ్య సఖ్యత కొరవడడంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చిన్నపాటి అంశాల్లో విభేదాలతో మంత్రులు రచ్చ చేసుకోవద్దని, స్వల్ప వివాదాలకు సంబంధించి రోడ్డెక్కడం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. అనవసర విషయాలకు రాద్ధాంతం చేసుకోవడం వల్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా పలుచన అవుతున్నామని హితవు పలికినట్లు సమాచారం. ఇలాంటి అవాంఛిత ఘటనలను నివారించాలని సూచించినట్లు తెలిసింది.
ఇప్పటివరకు జరిగిన ఘటనలను టీకప్పులో తుపానులా భావించి, ఇక నుంచి సంఘటితంగా ఉండాలని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం రేవంత్‌ని ఉద్దేశించి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగింది వదిలేసి ఇకపై మంత్రులంతా సంఘటితంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!