అయోధ్య దర్శన సమయాల్లో మార్పులు!

అయోధ్య దర్శన సమయాల్లో మార్పులు!
అయోధ్య రామమందిరాన్ని దర్మించే సమయాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ప్రకటించింది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దర్శన సమయ వ్యవధిని గంట తగ్గించినట్లు పేర్కొంది. నూతన మార్పులు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.  మంగళ హారతి తెల్లవారుజామున 4 గంటలకు, శృంగార్ హారతి 6:30కు ఇవ్వనున్నారు.
అనంతరం భక్తులను ఉదయం 7 గంటలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ హారతి, అలాగే 12:30 నుంచి 01:00 గంట వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు.  అనంతరం దర్శనం ఒంటి గంట తర్వాత తిరిగి ప్రారంభమై రాత్రి 9:30 వరకు కొనసాగనుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు రాత్రి 9:30 గంటల వరకు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత శయన హారతి ఇస్తారు. 

గతంలో ఆలయ ప్రాంగణాన్ని ఉదయం 6:30 గంటలకు తెరిచేవారు. బిర్లా ధర్మశాల ముందు ఉన్న గేటు వద్ద ఉదయం 8:30 గంటలకు ప్రవేశం మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెక్యూరిటీ గేట్ డీ1 నుంచి అనుమతి లేదని ట్రస్ట్ పేర్కొంది. మరోవైపు అయోధ్య రామమందిర పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 25న అయోధ్యలోని రామాలయంలో ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించనున్నారు.

ఆలయ నిర్మాణం పూర్తవుతుండడంతో భక్తులు ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి అధికారులు అవకాశం కల్పించనున్నారు.  మరోవైపు ఆడిటోరియం నిర్మాణం 2026 ప్రథమార్థానికి పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నవంబర్ 25న జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆయనకు ఆహ్వాన లేఖ పంపింది.

అయోధ్యలో నిర్మించిన రామాలయానికి ఉన్న చక్కదనం, తేజస్సు భక్తుల మనస్సును ఇట్టే ఆకర్షిస్తుంది. ఆలయంలోని ప్రతీ భాగం రామాయణ కథలను ప్రతిబింబిస్తుంది. అందుకు అణుగుణంగా ఆలయ అంతస్తులో సుమారు 140 క్లిష్టమైన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇవి రామాలయంలోని దైవిక చిత్రాలు, దృశ్యాలతో కనువిందు చేయనున్నాయి.  అవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా హిందూ గ్రంథాల్లోని కథలను ప్రతిబింబిస్తాయి.

అదే విధంగా సందర్శకులు నిర్మాణ వైభవాన్ని తిలకించడమే కాకుండా భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలను తెలుసుకుంటారు. ఆలయ రూపకల్పన రాబోయే తరాలకు గొప్ప అనుభవాలను మిగల్చనుంది.  సౌందర్యానికి అతీతంగా ఈ ఆలయాన్ని వీక్షించడానికి భారతదేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. మరోవైపు ఆలయ కాంప్లెక్స్లో 70 శాతం పచ్చదనం వెల్లివిరిసేలా మొత్తం 750 చెట్లను నాటారు.