
తనకు ఒకవైపు మహాసముద్రం, మరోవైపు భారత సైన్యం నిల్చోవడం గర్వంగా అనిపిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు, సైనికుల చేత వెలిగిన దీపాల కాంతి వలె దివ్యంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యమని పేర్కొన్నారు.
“ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దపు భారతదేశపు కృషి, ప్రతిభ, నిబద్ధతకు నిదర్శనం. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ఇన్ ఇండియాకు సంకేతంగా నిలిచింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన శత్రుదేశం పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది” అని ప్రధాని తెలిపారు. .
ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7వ తేదీన భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు సమన్వయంగా పనిచేసి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని అనేక ఉగ్ర స్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయని మోదీ గుర్తుచేశారు. త్రివిధ దళాల సమన్వయం పాక్‌ను ఓటమి ఒప్పుకునేలా చేసిందని చెప్పారు.
మావోయిస్ట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ద్వారా దేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందని ప్రధాని తెలిపారు. “భారత్ మావోయిస్టు హింస నుంచి విముక్తి అంచున ఉంది. గతంలో, 125 జిల్లాలు మావోయిస్టు ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లోనే మావోయిస్ట్ ఉగ్రవాదం ఉంది. సాయుధ దళాలు, పోలీసులు మావోయిస్టు హింసను పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధిస్తారని నాకు నమ్మకం ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారులలో ఒకటిగా మార్చడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వెల్లడించారు. 2014 నుంచి భారత ఓడరేవుల్లో 40కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను నిర్మితమయ్యాయని పేర్కొన్నారు. బ్రహ్మోస్ పేరు వింటే కొంతమంది మనసుల్లో (శత్రుదేశాలనుద్దేశించి) భయం నెలకొంటుందన్నారు. ఇప్పుడు చాలా దేశాలు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
More Stories
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత
తగ్గుముఖం పడుతున్న డాలర్ ఆధిపత్యం!