మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి

మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి

మావోయిస్టులకు మద్దతిస్తున్న రాజకీయ నేతలు సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో బండి సంజయ్‌ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదని ఆయన  తెలిపారు. 

అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం పూర్తిగా వెలికి తీస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ రంగస్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లెవేస్తూ, మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా ఇదే మా హెచ్చరిక అంటూ పోస్ట్ చేశారు. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. దేశభద్రతకు ముప్పుగా పరిణమించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరని హెచ్చరించారు. 

అవినీతి, నేరగాళ్ల లింకులపై కేంద్రం నిఘా పెట్టిందని, ఎవరైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తప్పుడు మార్గంలో వెళితే ఎంత పెద్ద నేతనైనా వదిలిపెట్టం అని బండిసంజయ్ పేర్కొన్నారు.  కేంద్ర సంస్థలు కఠిన చర్యలు తీసుకోబోతున్నాయని, అంతర్గత భద్రత విషయంలో రాజీలేదు. తప్పువైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదని బండి సంజయ్ పేర్కొన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను నిర్మూలించడానికి ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్రప్రభుత్వం చెబుతోంది.  ఆయుధాలు విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 
 
దేశంలో ప్రస్తుతం నక్సలైట్ల తీవ్ర ప్రభావం కేవలం 3 జిల్లాలకే పరిమితమైందని కేంద్ర హోంశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, సుక్మా, నారాయణ్‌పుర్‌ జిల్లాల్లో ఇంకా తీవ్రంగా మావోల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటిదాకా 312 మంది నక్సల్స్‌ను హతమార్చామని, 836 మందిని అరెస్టు చేశామని, 1,639 మంది లొంగిపోయారని వెల్లడించారు.