ప్రజ్ఞా భారతి 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్, హుముఖ ప్రజ్ఞాశాలి పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరిని పంచ నవతి జన్మదినం (95) సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ద్వారా జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ హనుమాన్ చౌదరి భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవని కొనియాడారు.
విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొలి చైర్మన్‌గా, టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. అందరికీ ఆదర్శప్రాయులని ఆయన ప్రశంసించారు. మన పెద్దల స్పూర్తిని యువతరం అందిపుచ్చుకుని నవ భారత నిర్మాణంలో చోదక శక్తులు కావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రజ్ఞా పురస్కారాలు అందుకున్న నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్ రావు, కల్లోల భారతం పుస్తక రచయిత కోవెల సంతోష్ కుమార్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.
ప్రజ్ఞాభారతి సంస్థ తీసుకున్న చొరవలో ‘లోక్ మంథన్’ కార్యక్రమం మహోన్నతమైందని, తాను ఎంతో అభిమానించేదని ఆయన తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు అవగాహన కల్పించడంలో విజయవంతమైందని ఆయన ప్రశంసించారు. కాగా, ‘బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది’ అని చెబుతూ నక్సల్స్ తమ వాదనను బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఇటీవల నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగిపోవడం శుభపరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకుని ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోవడం సంతోషకరమని పేర్కొంటూ వారు తమ వాదాన్ని బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి మద్దతు కోరాలని ఆయన సూచించారు. తుపాకి సంస్కృతితో సాధించేది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టుల వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని ఆయన కొనియాడారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, కుటుంబ వ్యవస్థ మన బలం అని ఆయన తెలిపారు. స్నేహ సంపద, కుటుంబ సభ్యులతో గడిపి సమయమే గొప్ప సంపద అని ఆయన చెప్పారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుఓవడానికి యువతరం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, దానిని ఎవరికి ఆపడం సాధ్యం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ నందకుమార్, ప్రజ్ఞా భారతి అధ్యక్షుడు వెంట్రప్రగడ శ్రీనివాస్, కార్యదర్శి ముంగమూరు రఘు తదితరులు పాల్గొన్నారు.

More Stories
ప్రభుత్వ అసమర్ధతతోనే వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
ఆదివాసుల సమస్యలపై సెక్రటేరియట్ ముందు ధర్నా
మహిళా ఎమ్యెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి