పాక్‌లోని ప్ర‌తి అంగుళం రేంజ్ లో బ్ర‌హ్మోస్

పాక్‌లోని ప్ర‌తి అంగుళం రేంజ్ లో బ్ర‌హ్మోస్
పాకిస్థాన్‌లోని ప్ర‌తి అంగుళం బ్ర‌హ్మోస్ మిస్సైల్ రేంజ్‌లోనే ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో జ‌రిగింది కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే అని ఆయ‌న పేర్కొన్నారు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థ తొలి బ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విజయవంతంగా ఉత్పత్తి చేశారు.  వాటిని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భారత సైన్యానికి అప్పగించారు. 
ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశం పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. “ఇది కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, భారతదేశ సామర్థ్యానికి ప్రతీక. వేగం, కచ్చితత్వం, శక్తి అనే మూడు లక్షణాలతో బ్రహ్మోస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ క్షిపణుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మోస్ మన సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు వెన్నెముకగా మారింది.” అని కొనియాడారు.
 
బ్ర‌హ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను మే 11వ తేదీన ప్రారంభించారు. మిస్సైల్ ఇంటిగ్రేష‌న్‌, టెస్టింగ్‌, ఫైన‌ల్ క్వాలిటీ చెకింగ్‌కు కావాల్సిన అన్ని ఆధునిక స‌దుపాయాలు ఉన్నాయి. విజ‌య‌వంతంగా టెస్టింగ్ జ‌రిగిన త‌ర్వాత‌, ఆ మిస్సైళ్ల‌ను భార‌త సైనిక ద‌ళాలు మోహ‌రించ‌నున్నాయి. 
 
ఇక్కడి బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి నిపుణులు లక్నోకు తరలివస్తారని, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుందని తెలిపారు.
 
భార‌తీయ సైనిక బ‌ల‌గాల‌కు బ్ర‌హ్మోస్ ఓ పిల్లర్‌లా మారింద‌ని, ఇది దేశ విశ్వాస సామ‌ర్థ్యాన్ని పెంచిందని రక్షణ మంత్రి తెలిపారు. బ్ర‌హ్మోస్ ఏరోస్పేస్‌లో త‌యారీ అయిన ఫ‌స్ట్ బ్యాచ్ క్షిప‌ణ‌ల‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప‌చ్చ‌జెండా ఊపారు.