జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి
 
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌ రెడ్డిని అభ్యర్థిగా బిజెపి ఖరారు చేసింది.  2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దీంతో అన్ని సమీకరణాలను పరిగణలోనికి తీసుకొని దీపక్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
 
ఈ సందర్భంగా దీపక్‌ రెడ్డి మాట్లాడుతూ టికెట్‌ వస్తుందని మొదటి నుంచీ నమ్మానని తెలిపారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం కొత్త నష్టమేనని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. సానుభూతి ఉన్న బీఆర్‌ఎస్‌నే మాకు ప్రధాన పోటీ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అసలు పోటీలోనే లేదని తెలిపారు.
 
కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీలు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ కూడా అభ్యర్థిని ఖరారు చేయడంతో ఉప ఎన్నిక ప్రచారం ఇక ఊపందుకునే అవకాశం ఉంది.  ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
 
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ నామినేషన్‌ వేశారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో  బుధవారం ఆమె తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సునీత వెంట కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావుగౌడ్ వెళ్లారు. బీఆర్ఎస్​ పార్టీ నేతలు ఇప్పటికే ఆమె తరఫున నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు ట్రిపుల్‌ ఆర్‌ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీకి రైతులు సిద్ధమయ్యారు. ఈ నెల 20 లోపు ప్రభుత్వం స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 21న నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. మొత్తం 300 మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్​ బావిస్తుండగా, ఆ స్థానంలో తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని అధికార కాంగ్రెస్​ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో చివరి వరకు ఆచితూచి అడుగులు వేసిన బీజేపీ ఎట్టకేలకు తమ అభ్యర్థిని ప్రకటించింది.