త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్‌’

త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్‌’
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సర్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈసీ అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికలు, ఎన్నికలు జరుగనున్న, జరుగుతున్న రాష్ట్రాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ ఉండదని పేర్కొన్నారు. 
 
ఎన్నికల యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలతో బిజీగా ఉందని, దాంతో సర్‌పై దృష్టి పెట్టలేమని ఈసీ చెబుతున్నది. వచ్చే ఏడాది అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు తొలి దశలో పలు రాష్ట్రాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ ప్రారంభించే ఛాన్స్‌ ఉంది. 
 
ఇప్పటికే బిహార్‌లో సర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. 7.472 కోట్ల పేర్లతో తుది జాబితాను సెప్టెంబర్‌ 30న ఈసీ ప్రచురించింది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణను ప్రారంభించే పని జరుగుతోందని, ప్రారంభంపై తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గత సోమవారం తెలిపారు.
 
ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు 15 రోజుల్లో సర్‌ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో 2008 నుంచి ఓటర్ల జాబితాలున్నాయి.  ఆ సమయంలోనే దేశ రాజధానిలో చివరిసారిగా సమగ్ర సవరణ జరిగింది. 
 
ఉత్తరాఖండ్‌లో చివరి సర్‌ 2006లో నిర్వహించగా ఆ సంవత్సరం ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల చివరి సర్‌ ప్రక్రియ 2002 నుంచి 2004 మధ్య జరిగింది. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే సర్‌ ప్రాథమిక లక్ష్యమని ఈసీ పేర్కొంటున్నది.