అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత సాంకేతిక మిషన్‌ను రాయబార కార్యాలయం హోదాకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో భేటీలో విదేశాంగ మంత్రి ఎస్జైశంకర్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీతో జైశంకర్ సమావేశమయ్యారు. 20 అంబులెన్స్‌లను అఫ్గాన్‌కు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఎంఆర్ఐ, సీటీ స్కాన్ మెషీన్లను సమకూర్చడంతో పాటు, రోగనిరోధక వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేయనుందని జైశంకర్ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లో ఆరు కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక బంధం రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని ఈ భేటీలో జైశంకర్ వ్యాఖ్యానించారు. అఫ్గాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. వృద్ధి, శ్రేయస్సు పట్ల భారత్-అఫ్గానిస్థాన్ ఉమ్మడి నిబద్ధతను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో పడినట్టు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఫ్గాన్ సంఘీభావం తెలిపిందని పేర్కొంది. మరోవైపు భారత్ ఒక కీలక దేశమని ముత్తాఖీ అభివర్ణించారు. అఫ్గాన్ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ అనేక రంగాలలోసహాయం చేసిందని గుర్తు చేశారు.
తమ దేశంలో మైనింగ్ కు అఫ్గాన్ ఆహ్వానం
తమ దేశంలో మైనింగ్ చేయడానికి భారతీయ కంపెనీలను అఫ్గాన్ ఆహ్వానించింది. దీనిని భారత్ స్వాగతించింది. ముత్తాకితో భేటీ సందర్భంగా జైశంకర్, అభివృద్ధి భాగస్వామ్యం నుంచి క్రికెట్ వరకు ఇరుదేశాల ఉన్న అనేక సంబంధాల గురించి ప్రస్తావించారు. అలాగే వాణిజ్యపరంగా దిల్లీ, కాబూల్ మధ్య అదనపు విమానాల ప్రారంభం గురించి మాట్లాడారు.
ఆఫ్గన్ విద్యార్థులు భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి మార్గాలను విస్తరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 2025 ఏప్రిల్‌లో ఆఫ్గన్ ప్రజల కోసం కొత్త వీసా మాడ్యూల్ ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆఫ్గన్ల క్రికెటర్లు చాలా ప్రతిభావంతులను ఆయన ప్రశంసించారు. అన్నింటి కంటే ముఖ్యంగా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆఫ్గనిస్థాన్ చాలా స్పష్టంగా భారత్‌కు సంఘీభావం ప్రకటించింది. ఈ విషయంలో అఫ్గాన్‌పై జైశంకర్ ప్రశంసలు కురిపించారు.
2021లో అమెరికా సైన్యం వైదొలగడంతో అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అఫ్గాన్‌లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్‌లను మూసివేసింది. 2022లో అఫ్గాన్‌లో టెక్నికల్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. తాజా చర్చల్లో దీన్ని ఎంబసీగా అప్‌గ్రేడ్ చేసేందుకు భారత్ సిద్ధమైనట్టు జైశంకర్ ప్రకటించారు.

More Stories
మోదీ- పుతిన్ భేటీతో కొత్త స్థాయికి భారత్- రష్యా బంధం
‘నేషన్ ఫస్ట్ పాలసీ’కి అనుగుణంగానే సంస్కరణలు
జ్ఞాన్వాపి మసీదు, కృష్ణజన్మభూమి వైపు యోగి?