వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది.
మరియా కొరినా మచాడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, దాంతో పాటు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అరుదైన గౌరవం లభించింది.
వెనెజులా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని తెలిపింది. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ కొనియాడింది.
దేశంలో ప్రజాస్వామ్య జ్వాలలను వెలిగిస్తూ ధైర్యవంతమైన, నిబద్ధత కలిగిన శాంతి విజేత అంటూ మచాడోపై సదరు కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేయడంతో.. ఈ ఏడాది ప్రజలను ప్రభావితం చేసిన 100 మంది ప్రభావంతుల జాబితాలో ఆమె పేరు చేర్చారు. ఇక మరియా కొరినా మచాడోను వెనిజులా ఉక్కు మహిళ అని కూడా పిలుచుకుంటారు. మరియా ప్రస్తుతం వెనెజులా ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2011 నుంచి 2014 వరకు వెనెజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. 2002లో మరియా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో వెనెజుల అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ కాగా, అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. అయితే నోబెల్ శాంతి పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
రెండోసారి అధికారం చేపట్టినప్పటిన నాటి నుంచి ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారు. తనకు నోబెల్ ఇవ్వాలని బహిరంగంగానే పలుసార్లు ప్రస్తావించారు ట్రంప్. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా తనకు తానే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధిపతి మునీర్‌తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు.

More Stories
`బాబ్రీ మసీద్’కు భూమి పూజ నిప్పుతో చెలగాటం.. బిజెపి
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి