అది ముగిసిన అధ్యాయం మాత్రమే

అది ముగిసిన అధ్యాయం మాత్రమే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ షూ విసిరేసేందుకు ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తొలిసారిగా ఓ కేసు విచారణ సమయంలో స్పందిస్తూ సోమవారం జరిగిన ఘటనతో తనతో పాటు సహచర న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ షాక్‌కు గురయ్యామని తెలిపారు. 
 
అయితే, అది తమ దృష్టిలో ముగిసిన అధ్యాయం మాత్రమేనని చెప్పారు. ఈ విషయంపై మరింత ముందుకు తీసుకెళ్లబోనని వ్యాఖ్యానించారు. బెంచ్‌లో జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌ ఉండగా ఈ అంశంపై ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. ఈ ఘటనపై తనకు సొంత అభిప్రాయం ఉందని, దీన్ని ఆషామాషీగా తీసుకునే విషయం కాదని పేర్కొన్నారు. 
 
జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ భారత ప్రధాన న్యాయమూర్తి అని, న్యాయమూర్తులుగా తాము అనేక నిర్ణయాలు తీసుకుంటామని, అవి ఇతరులు సరైనవిగా భావించకపోవచ్చని తెలిపారు. ఆ కారణంతో తాము తీసుకున్న నిర్ణయాల్లో మార్పు రాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ న్యాయవాది చర్యలు క్షమించరానివని స్పష్టం చేశారు. సీజేఐపై ప్రశంసలు కురిపించారు.

మరోవైపు, న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌పై సుప్రీంకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌  చర్యలు ప్రారంభించింది. రాకేశ్‌ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని తెలిపింది. వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.