భారత్ లో తొమ్మిది యుకె విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు

భారత్ లో తొమ్మిది యుకె విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు

యూకేకు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు భారత్​లో క్యాంపస్​లను ప్రారంభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం తాలుక గురుగ్రామ్ క్యాంపస్ ఇప్పటికే ప్రారంభమైందని, అక్కడ ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ముంబయిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తో ఉన్నత స్థాయి చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.

 “భారత్-యూకే భాగస్వామ్యం విశ్వసనీయమైనది. ప్రతిభ, సాంకేతికత ఆధారితమైనది. యూకే ప్రధాని స్టార్మర్ నాయకత్వంలో భారత్, యూకే సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. భారత్, యూకే సహజ భాగస్వాములు. ప్రస్తుత ప్రపంచ అస్థిరత యుగంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఈ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి ఒక ముఖ్యమైన పునాది.” అని మోదీ తెలిపారు.

భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి కీలకమైన పునాదిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఇండియా-బ్రిటన్ సంబంధాలకు పునాది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలపై ఉన్న ఉమ్మడి నమ్మకమేనని తెలిపారు.

 
“భారత్, యూకే మధ్య అతిపెద్ద బిజినెస్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. వీటన్నింటితో పాటు ఇరుదేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి సూచనలు, అవకాశాలను పంచుకున్నాం. జులైలో నేను యూకే పర్యటన సందర్భంగా చరిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం” అని తెలిపారు. 
 
“భారత్‌-బ్రిటన్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, రెండు దేశాలకు దిగుమతి ఖర్చు తగ్గుతుంది. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాణిజ్యం పెరుగుతుంది. ఈ ఒప్పందం భారత్​లోని పరిశ్రమలు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది నెలల్లోనే, ఇప్పటివరకు అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం యూకే ప్రధాని స్టార్మర్​తో పాటు భారత్​కు రావడం ఇరుదేశాల భాగస్వామ్యానికి నాందిగా నిలిచింది”అని వివరించారు.

“ఈరోజు సమావేశంలో, మేము ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం, ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించాం. ఉక్రెయిన్- రష్యా యుద్ధం, గాజా సంఘర్షణ వంటి అంశాలపై చర్చించాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకేతో సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది” అని ప్రధాని స్పష్టం చేశారు. 

“కీలకమైన ఖనిజాలపై సహకారం కోసం ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సైనిక శిక్షణలో సహకారంపై భారత్, యూకే ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత వైమానిక దళ ఫ్లయింగ్ బోధకులు యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌ లో శిక్షకులుగా పనిచేస్తారు.” అని మోదీ వ్యాఖ్యానించారు.

భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో ప్రధాని మోదీతో సమావేశం కావడం చాలా ముఖ్యమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. భారతదేశ వృద్ధి కథ చాలా అద్భుతమైనదని కొనియాడారు. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, ప్రధాని మోదీ నాయకత్వాన్ని తాను అభినందించాలనుకుంటున్నానని వెల్లడించారు. 2047 నాటికి భారత్​ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు.