
వార్తల్లో తరచుగా రైతుల ఆత్మహత్యలు ఉండడం, సమాజంలో ఆందోళన కలిగించేది.అయితే, గత పదేళ్లలో మారిన పరిస్థితులు, సాగునీటి విస్తరణ, ప్రభుత్వాల విధానాల కారణంగా ప్రస్తుతం రైతు ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. కానీ ఈ సానుకూల మార్పుతో పాటుగా సమాజంలో మరో చీకటి కోణం ఆందోళన కలిగిస్తోంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సి ఆర్ బి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ యువతరం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు దాదాపు 10 రెట్లు అధికంగా పెరగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సి ఆర్ బి తాజా గణాంకాల ప్రకారం 2023 సంవత్సరంలో తెలంగాణలో 582 విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇది అదే సంవత్సరంలో నమోదైన 58 రైతు ఆత్మహత్యల కంటే దాదాపు 10 రెట్లు అధికం.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 2015లో 1,358 ఉండగా, 2023 నాటికి అవి గణనీయంగా తగ్గి 58కి చేరుకున్నాయి. ఇదే కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 2015లో 481 నుంచి 582కి పెరిగాయి. వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు 900 నుంచి 4,009 వరకు అధికంగా నమోదయ్యాయి.
విద్యార్థుల ఆత్మహత్యల విషయానికి వస్తే తెలంగాణలో వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో 200 నుంచి 400 మధ్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తెలంగాణ ఆ సంఖ్య దాదాపు 600కు చేరువగా ఉంది. మరోవైపు 2023లో ప్రభుత్వ ఉద్యోగుల (రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు) ఆత్మహత్యలు కూడా రైతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ సంవత్సరంలో 96 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
More Stories
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం
డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ దేశానికే ఆదర్శం
జూబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఎందుకు పోటీ చేయడం లేదు?