ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!

ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దృష్టిలో ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా? ఇదే సలహా చర్చికో, మసీదుకో ఇవ్వగలరా? అంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టాలని సలహా ఇస్తారా? అంటూ మండిపడ్డారు. అయినా షర్మిలకు ఆస్తుల గురించి తప్ప ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసు? అని ఎద్దేవా చేసారు.

“హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలు ఆమె సొంత విధానమా? లేక కాంగ్రెస్‌ పార్టీ విధానమో స్పష్టం చేయాలి. మతమార్పిళ్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారికి దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడమనేది ఆశ్యర్యాన్ని కలిగించడం లేదు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని విరాళాల సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంట్‌గా ఉన్న షర్మిల ఇప్పుడు దేవాలయాల నిర్మాణాలపై మాత్రం తెగ విమర్శలు చేస్తున్నారు” అంటూ మంత్రి ఆనం విమర్శించారు. 

 
“దళితవాడల్లో గుళ్లు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన షర్మిలలో కనిపిస్తుంది. టీటీడీ అనేది ప్రభుత్వ ఖజానా కాదు. ఆ సంస్థకు వచ్చే విరాళాలను వినియోగించడానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఖర్చు పెట్టాలి” అని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తలెత్తుకునే పరిస్థితి లేదని, షర్మిల స్థాయికి మించి మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. వైఎస్‌ అన్ని మతాలను గౌరవిస్తే, వారి పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారీ ద్వేషిస్తున్నారని ఆనం మండిపడ్డారు.

“రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో దళిత, గిరిజన కాలనీల్లో 5,000 ఆలయాలను నిర్మించనున్నాం. వీటికి అవసరమైన నిధులను ప్రజల నుంచే విరాళాలుగా సేకరించనున్నాం” అని మంత్రి ఆనం తెలిపారు. నవంబరులో వెయ్యి ఆలయాల విస్తరణాభివృద్ధి పనులు చేపడుతున్నామని, 926 దేవాలయాల్లో పాలకవర్గాలఏర్పాటుకు నోటిఫికేషన్లు జారీ చేశామని మంత్రి తెలిపారు.

దళితవాడల్లో ఆలయాలు వద్దా?

కాగా, తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించిన ముడుపులతో దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తే క్రైస్తవ మతాన్ని ఆచరించే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఇబ్బంది ఎంటి? అని బీజేపీ నేత వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ ప్రశ్నించారు. ‘తిరుమల కొండపై ఆమె కుటుంబం ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంది. ఏడు కొండలు కాదన్న తండ్రి, లడ్డూను కల్తీ చేయించిన అన్న, దళిత వాడల్లో ఆలయాలే వద్దంటోన్న చెల్లి. హిందూ దళితులున్న కాలనీల్లో చర్చిల నిర్మాణంపైనా షర్మిల ఇలాగే స్పందిస్తారా?’ అంటూ వల్లూరు నిలదీశారు.