హమాస్‌ నేతలే లక్ష్యంగా ఖతార్‌లో ఇజ్రాయెల్‌ దాడులు

హమాస్‌ నేతలే లక్ష్యంగా ఖతార్‌లో ఇజ్రాయెల్‌ దాడులు

హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే హమాస్‌ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఖతార్‌లో దాడులకు దిగింది. దీంతో ఆ దేశ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే, ఈ దాడి ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? తదితర వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. 

అయితే వైమానిక దళం ఈ పని పూర్తిచేసినట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి కర్నల్ అవిచాయ్ అడ్రాయీ వెల్లడించారు. ఖతార్​లో జరిగిన దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్‌ చేపట్టామని ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఈ ఆపరేషన్​ తామే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నామని రాసుకొచ్చారు. 

మరోవైపు తమ దేశంలోని హమాస్‌ పొలిటికల్‌ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడిని ఖతార్‌ ఖండించింది. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందంటూ విదేశాంగశాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఈ నిర్లక్య ప్రవర్తన వల్ల ప్రాంతీయ భద్రతకు అంతరాయం జరుగుతుందని అన్నారు. ఇలాంటి చర్యలను ఎప్పటికి సహించబోమని తెలిపారు.

ఈ దాడిని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం అభివర్ణించారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్. ఇది చాలా ప్రమాదకరమైన నేరపూరిత చర్య అని అన్నారు. అంతర్జాతీయ నియమాలు, చట్టాలను, ఖతార్ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది ఆరోపించారు. ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ సైతం ఇజ్రాయెల్‌ చర్యలను తప్పుపట్టారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఖతార్‌ అనేక ఏళ్ల పాటు మధ్యవర్తిగా వ్వవహరించింది. ఆ దేశ చొరవను టెల్‌అవీవ్‌ పలు సందర్భాల్లో స్వాగతించింది. అదే సమయంలో హమాస్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదంటూ విమర్శలూ గుప్పించింది. గాజా యుద్ధం మొదలు ఖతార్‌లో దాడులు జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల సమయంలో ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్‌ క్షిపణులు ప్రయోగించింది.