నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. రెండు రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్‌లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ ఇంతకుముందు కాఠ్మండూ సహా పలు జిల్లాల్లో యువత ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు.
ప్రజలు గుమిగూడకూడదని ఆంక్షలున్నా లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆందోళనల్లో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని, దేశాన్ని విడిచిపోవాలంటూ రెండో రోజూ యువత రోడెక్కారు.
అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేశారు. భక్తాపూర్‌లోని బాల్‌కోట్‌లో ఉన్న ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. తర్వాత బల్వతార్‌లోని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు.
ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ సాయంత్రం ఆరు గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. పరిస్థితి చక్కదిద్దుదామని యత్నించిన కేపీ శర్మ ఓలి, చర్చలతోనే సంక్షోభం పరిష్కారమవుతుందని చెప్పారు. ఈలోపే తన అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. వరుసగా రెండోరోజూ ఆందోళనలు కొనసాగడంతో నేపాల్ వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు.
సోమవారం నిరనసకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య, జనాభా శాఖ మంత్రి ప్రదీప్ పౌడ్యాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు.
యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి కాఠ్‌మాండూ, భక్తాపూర్, లలిత్‌పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినా నిరసనకారులు విధ్వంసం కొనసాగించారు. మరోవైపు ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామాతో నేపాల్ పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. రాజీనామాకు ముందే కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో మాట్లాడారని తెలుస్తోంది.
సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు పేర్కొన్నాయి. ఓలీ దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలీ రాజీనామాతో మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇదేసమయంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను తరలిస్తున్నారు.

More Stories
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం
చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష
2026 బెంగాల్ ఎన్నికలు భారతదేశ జాతీయ భద్రతా యుద్ధం