
* కుల్గామ్ జిల్లాలో ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కుల్గాంలోని గుదార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని ఆ అధికారి పేర్కొన్నారు.
భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దాంతో భద్రతా బలగాలు సైతం ఆత్మరక్షణగా కాల్పులు జరుపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది. అప్రమత్తంగా ఉన్న దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయని, ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపింది.
ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పింది. ఆపరేషన్‌లో గాయపడ్డ సైనికులను వైద్యం కహాసం తరలిస్తున్నట్లు చెప్పింది. ఉగ్రవాదుల గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం సంఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం వివరించింది. కచ్చితమైన సమాచారం ఆధారంగా, కుల్గాంలోని గుడ్డర్ అడవిలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్‌ఓజీ, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
ఇదే సమయంలో జమ్మూ ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 9:20 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు ఒక చొరబాటుదారుడిని గుర్తించారు. అతడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా నివాసి సిరాజ్ ఖాన్‌గా తేలింది. బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే కొన్ని రౌండ్లు కాల్పులు జరిపిన బీఎస్‌ఎఫ్, అతడిని సరిహద్దు కంచె వద్ద అదుపులోకి తీసుకుంది.
More Stories
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్
ఆధార్ ను ఐడీ ప్రూఫ్ గా ఆమోదించాల్సిందే
మహారాష్ట్ర సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు